సీనియర్లకు షాక్...జూనియర్లకు ప్రమోషన్!

July 08, 2021


img

ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గంలో సీనియర్లకు ఊహించనివిదంగా షాక్ ఇచ్చి, జూనియర్లకు కీలకపదవులు కట్టబెట్టడం విశేషం. మొత్తం 12 మంది సీనియర్ మంత్రులను తొలగించి, 36 మంది కొత్తవారిని నియమించుకొన్నారు. కేంద్ర సహాయమంత్రిగా ఉన్న జి.కిషన్‌రెడ్డితో సహా ఏడుగురికి కేంద్రమంత్రులుగా ప్రమోషన్ కల్పించారు. 

ఈసారి మోడీ మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు చోటు కల్పించారు. వచ్చే ఏడాది జరుగబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రానికి చెందిన ఏడుగురికి మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. సామాజిక కోణంలో కూడా లెక్కలు కట్టుకొని ఎస్సీ వర్గానికి 12, ఎస్టీ వర్గానికి 8, మైనార్టీలకు 5, అత్యాదికంగా ఓబీసీలకు 27 మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా ఉన్న జేడీయూ, లోక్‌జన్ శక్తి, అప్నాదళ్ పార్టీలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గంలో పదవులు కేటాయించారు.     

కరోనా సెకండ్ వేవ్‌ను అడ్డుకోవడంలో కేంద్రం విఫలం అవడం, ముఖ్యంగా ఆక్సిజన్, వాక్సిన్, మందుల సరఫరాలో విఫలమవడం వంటి పలు కారణాలతో వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పదవిని కోల్పోయారు. పలువురు సీనియర్ మంత్రులు పనితీరు సరిగా లేకపోవడం లేదా రాజకీయ కారణాలు, అవసరాల కోసం రాజీనామాలు చేసి తప్పుకోవలసి వచ్చింది. 

ఇక జ్యోతిరాధిత్య సిందియా వంటి యువనేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించడమే కాక కీలక పదవులు కట్టబెట్టారు. ఏకంగా 12 మంది సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలకడం చాలా సాహసోపేతమైన నిర్ణయమే అని చెప్పవచ్చు. అలాగే ఈసారి పలు సామాజిక, రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలను పరిగణనలో తీసుకొని ప్రధాని నరేంద్రమోడీ చాలా ఆచితూచి మంత్రి వర్గ విస్తరణ చేశారని చెప్పవచ్చు. 


Related Post