జి.కిషన్‌రెడ్డికి సాంస్కృతికం, పర్యాటక శాఖలు

July 08, 2021


img

కేంద్రప్రభుత్వంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఏకైక ప్రతినిధిగా ఉన్న జి.కిషన్‌రెడ్డికి నిన్న జరిగిన కేంద్రమంత్రివర్గ విస్తరణలో కేంద్రమంత్రిగా పదోన్నతి పొందారు. ఆయనకు సాంస్కృతిక, పర్యాటక శాఖ లభించాయి. దాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కూడా లభించింది. 

ఓ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్రమంత్రి స్థాయి వరకు కిషన్‌రెడ్డి బిజెపిలో అంచెలంచెలుగా ఎదగడానికి పార్టీ పట్ల నిబద్దత, పార్టీ అధిష్టానం  పట్ల విధేయత, ఇచ్చిన బాధ్యతలను సమర్ధంగా నిర్వహించడం, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులతో సత్సంబంధాలు కలిగి ఉండటం వంటివి అనేకం దోహదపడ్డాయని చెప్పవచ్చు. 

గమ్మతైన విషయం ఏమిటంటే 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడం కూడా ఆయనకు కేంద్రమంత్రి అయ్యేందుకు దోహదపడింది. శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడంతో ఆ తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. దాంతో ఆయనకు తొలిసారిగా కేంద్రమంత్రివర్గంలో సహాయమంత్రిగా అవకాశం లభించింది. ఆ బాధ్యతను అత్యంత సమర్ధంగా నిర్వహించడంతో ఇప్పుడు కేంద్రమంత్రిగా పదోన్నతి పొందారు. 

అయితే ఆయన రక్షణశాఖ సహాయ మంత్రిగా వ్యవహరించినప్పటికీ హైదరాబాద్‌కు సంబందించి ఓ చిన్న సమస్యను పరిష్కరించలేకపోయారని చెప్పక తప్పదు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కైవే నిర్మాణం కోసం సికింద్రాబాద్‌లో రక్షణశాఖకు చెందిన భూములను ఇవ్వాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. కానీ సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ...రక్షణ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించిన కిషన్‌రెడ్డి ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పించడంలో విఫలమయ్యారు. అయితే ఇందుకు ఆయనను తప్పుపట్టలేము. రక్షణశాఖ పరంగా ఉండే అవసరాలు లేదా సమస్యలు కారణం అయ్యుండవచ్చు లేదా టిఆర్ఎస్‌-బిజెపిల మద్య జరిగే రాజకీయ విభేధాలు కారణమైయుండవచ్చు. 

ఇప్పుడు సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కనుక మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా, రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యాటక రంగం అభివృద్ధికి కిషన్‌రెడ్డి తోడ్పడతారని ఆశిద్దాం.


Related Post