అమెరికా సైనికుల త్యాగాలు వృధాయేనా?

July 06, 2021


img

అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా, నాటో దళాలు నిష్క్రమించడంతో మళ్ళీ ఆ దేశానికి తాలిబాన్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను తమ అధీనంలోకి తెచ్చుకొన్న తాలిబన్లు షరియత్ చట్టాన్ని కటినంగా అమలుచేస్తున్నారు. మహిళలు ఎవరూ ఒంటరిగా బయటకు రాకూడదని, పురుషులు విధిగా గడ్డం పెంచుకోవాలని, ఎవరూ మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ వాడకూడదని, పత్రికలు చదువరాదని ఆదేశిస్తున్నారు. వారి ఆదేశాలను పాటించనివారిని కటినంగా శిక్షిస్తున్నారు. తమ అధీనంలో ఉన్న ప్రాంతాలలో పాఠశాలలను మూయించివేస్తున్నారు. దాంతో పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు. ఇదివరకు అమెరికన్, నాటో దళాలు అండగా ఉండటంతో అఫ్గాన్ సైనికులు తాలిబన్లతో ధైర్యంగా పోరాడేవారు. కానీ ఇప్పుడు వారు వెళ్ళిపోవడం, అఫ్గాన్ ప్రభుత్వం నిసహాయ స్థితికి చేరుకొంటుండటంతో ప్రజలతో పాటు సైనికులు సైతం ఇరుగుపొరుగు దేశాలకు పారిపోతున్నారు. ఆఫ్ఘాన్ సైనికులు వెనక్కు తగ్గుతుండటంతో తాలిబన్లు ఇంకా వేగంగా దేశాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అఫ్గానిస్తాన్ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. మళ్ళీ దేశంలో ఆరాచక పరిస్థితులు కనిపిస్తుండటంతో సామాన్య ప్రజలు ముఖ్యంగా మహిళలు, చిన్నారులు భయంభయంగా జీవితాలు గడుపవలసివస్తోంది. 

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు విధ్వంసం సృష్టిస్తుండటంతో సుమారు రెండు దశాబ్దాల క్రితం అమెరికన్ సైనికులు అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇటీవల నిష్క్రమించేవరకు తాలిబన్లతో పోరాడుతూనే ఉన్నారు. రెండు దశాబ్ధాలపాటు సాగిన ఈ పోరాటంలో వందలాది మంది అమెరికన్ సైనికులు మరణించారు. అనేకమంది తీవ్రంగా గాయపడి శాస్విత అంగవైకల్యానికి గురయ్యారు. రెండు దశాబ్ధాలపాటు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడినా మళ్ళీ ఇప్పుడు తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను తిరిగి ఆక్రమించుకొంటూ అరాచకం సృష్టిస్తుండటంతో ఆ దేశాన్ని కాపాడేందుకు అమెరికా సైనికులు చేసిన త్యాగాలన్నీ వృధా అయ్యాయని చెప్పక తప్పదు.


Related Post