ఇది ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల స్వయంకృతాపరాధమేనా?

July 06, 2021


img

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య నెలకొన్న శాంతి, సామరస్య వాతావరణం కృష్ణానదీ జలాల పంపకాలు, శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి అంశాలపై రగిలిన వివాదంతో మళ్ళీ చెడింది. వీటిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాట మొదలుపెట్టి కొద్ది రోజులలోనే ఈ యుద్ధాన్ని పతాకస్థాయికి తీసుకుపోయాయి. అవి నిజంగా తమ తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకొనేందుకు గొడవ పడుతున్నాయా లేదా రాజకీయ లబ్ది కోసం ఈ యుద్ధాలు చేస్తున్నాయా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ కారణంతో గొడవ పడుతున్నప్పటికీ అవి రాజేసిన ఈ అగ్గి ఇప్పుడు వాటినే కాల్చుతోందని చెప్పకవచ్చు. 

ఈ దశలో రెండు ప్రభుత్వాలు వెనక్కు తగ్గలేని పరిస్థితి చేజేతులా కల్పించుకొన్నాయని చెప్పక తప్పదు. ఒకవేళ తగ్గితే వాటిని నడుపుతున్న అధికార టిఆర్ఎస్‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో విఫలమైందంటూ విరుచుకుపడటం ఖాయం. అదే జరిగితే రాజకీయంగా ఎంతో కొంత నష్టపోవడం కూడా ఖాయం. ఈనెల 19వ తేదీన జరుగబోయే కృష్ణా నదీ బోర్డు యాజమాన్యం సమావేశంలో ఏ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం జరిగినా రెండో రాష్ట్రంలో అధికార పార్టీపై ప్రతిపక్షాలు విరుచుకుపడటం ఖాయం. పైగా ఈ గొడవలు ఇలాగే కొనసాగిస్తే రెండు రాష్ట్రాల ప్రజల మద్య కూడా సామరస్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది. 

రెండు తెలుగు రాష్ట్రాలలో మేధావులు, విద్యుత్, సాగునీటి నిపుణులు ఉన్నారు. వారి సాయంతో సున్నితమైన ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా, కారణాలు ఏవైతేనేమీ రెండు ప్రభుత్వాలు పంతాలకు, పట్టుదలలకు పోయి ప్రాజెక్టుల వద్ద పోలీసులను మోహరించుకొని వారు కూడా ఘర్షణ పడే స్థితికి తీసుకువచ్చాయి. 

ఇటువంటి అవాంఛనీయ పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాలకు మంచివి కావు...గౌరవప్రదం కూడా కావు. ఈ సమస్యను ప్రభుత్వాలే చేజేతులా సృష్టించుకొన్నాయి కనుక దీనిని అవే పరిష్కరించుకోవలసి ఉంటుంది లేకుంటే వాటిని నడిపిస్తున్న పార్టీలే మూల్యం చెల్లించవలసి రావచ్చు అని గ్రహిస్తే మంచిది.


Related Post