సిఎం కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి సవాల్

July 05, 2021


img

సిఎం కేసీఆర్‌కు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “  కృష్ణా జల వివాదంపై సిఎం కేసీఆర్‌, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరూ కలిసి పోరాడుకొంటున్నట్లు నాటకం ఆడుతున్నారు. వారు తమ రాజకీయలబ్ధి కోసమే ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారు తప్ప ఇద్దరికీ చిత్తశుద్ది లేదు. సిఎం కేసీఆర్‌ నిజంగా కృష్ణా జలాల కోసం పోరాడుతున్నట్లయితే ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష చేయాలి. నేను సోనియా గాంధీని ఒప్పించి ఆయన దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేలా చేస్తాను. సిఎం కేసీఆర్‌ తన రాజకీయ అవసరాల కోసం తెలంగాణ, ఏపీ ప్రజలను రెచ్చగొడుతుండటం చాలా బాధాకరం. ఈ విషయంలో సిఎం కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే ఈనెల 19న కృష్ణానదీ యాజమాన్యం బోర్డు సమావేశాన్ని మర్నాటికి వాయిదా వేయాలని ఎందుకు కోరుతున్నారు?బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించడానికి అధికారులను, మాజీ సాగునీటిశాఖ మంత్రులు కడియం శ్రీహరి లేదా తుమ్మల నాగేశ్వర రావులలో ఎవరో ఒకరిని పంపించవచ్చుకదా?” అని ప్రశ్నించారు. 

ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాలను వ్యతిరేకించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి ఉద్యమద్రోహులతో టిఆర్ఎస్‌ ప్రభుత్వం నిండిపోయిందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, పార్టీ ఓడిపోవడంతో టిఆర్ఎస్‌లోకి ఫిరాయించిన దానం నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుండటం సిగ్గుచేటని, అటువంటి అవకాశవాద, ఫిరాయింపు నేతలను ప్రజలు చెప్పులతో తరిమి కొట్టే రోజు త్వరలోనే వస్తుందని రేవంత్‌ రెడ్డి అన్నారు. 


Related Post