ఈటలకు ప్రధాని మోడీ ఆశీర్వచనాలున్నాయి: బండి

July 05, 2021


img

ఈటల రాజేందర్‌పై తప్పుడు కేసులు బనాయించి జైలుకి పంపేందుకు టిఆర్ఎస్‌ సర్కార్ కుట్రలు పన్నుతోందని, కానీ ఈటల వెనుక కేంద్రప్రభుత్వం, ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ ఆశీర్వదాలున్నాయనే సంగతి సిఎం కేసీఆర్‌ గుర్తుంచుకోవాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనను ప్రశ్నించినందుకే ఈటలపై కక్ష కట్టారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిరంకుశ పాలన సాగిస్తున్న సిఎం కేసీఆర్‌ను గద్దె దించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నెలకొల్పుతామని అన్నారు. తెలంగాణ ప్రజలు కూడా సిఎం కేసీఆర్‌ నిరంకుశ వైఖరితో విసిగిపోయున్నారని, కనుక హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో ఈటల రాజేందర్‌ను గెలిపించడం ద్వారా ఆ విషయాన్ని స్పష్టం చేయబోతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని,  కనుక ఆ పార్టీకి ఓట్లు వేస్తే అవి టిఆర్ఎస్‌కు వేసినట్లే అవుతుందని అన్నారు. కొంతమంది టిఆర్ఎస్‌ నేతలు కూడా హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ గెలవాలని కోరుకొంటున్నారని బండి సంజయ్‌ అన్నారు. 

ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు డికె.అరుణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు జిల్లాల నుంచే వర్చువల్ పద్దతిలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


Related Post