ఉత్తరాఖండ్ నూతన సిఎం పుష్కర్ సింగ్‌ ధామి

July 03, 2021


img

బిజెపి అధిష్టానం ఆదేశం మేరకు ఉత్తరాఖండ్ సిఎం తీరధ్ సింగ్‌ శుక్రవారం తన పదవికి రాజీనామా ఇచ్చారు. ఈ ఏడాది మార్చి10న ఆయన సిఎం పదవి చేపట్టారు. కానీ వివాదాస్పద నిర్ణయాలు, పార్టీలో అసమ్మతి ఇంకా అనేక ఇతర కారణాల చేత పదవి చేపట్టి నాలుగు నెలలు కాకమునుపే కుర్చీలో నుంచి దిగిపోవలసి వచ్చింది. ఆయన రాజీనామాకు మరో బలమైన కారణం కూడా ఉంది. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే తప్పనిసరిగా శాసనసభ లేదా మండలిలో సభ్యులై ఉండాలి. లేదా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా ఎన్నిక కావలసి ఉంటుంది. ఆయన ఎంపీ కావడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా శాసనసభకు పోటీ చేసి గెలవాల్సి ఉంది. అందుకు ఆయన సిద్దపడినప్పటికీ ఉత్తరాఖండ్ శాసనసభ గడువు వచ్చే మార్చితో పూర్తయి మళ్ళీ ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది కనుక బిజెపి అధిష్టానం శాసనసభ ఉపఎన్నికకు వెళ్ళడం కంటే పార్టీకి ఇబ్బందికరంగా మారిన తీరధ్ సింగ్‌ను సిఎం పదవి నుంచి దించేయడమే మంచిదని భావించి ఉండవచ్చు. కానీ కరోనా కారణంగా ఉపఎన్నికలు నిర్వహించలేని కారణంగా ఆయన రాజీనామా చేస్తున్నారని బిజెపి అధిష్టానం చెప్పుకొంటోంది.

తీరధ్ సింగ్‌తో కలిపి ఈ నాలుగేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి నాలుగో ముఖ్యమంత్రి రాబోతున్నారు. సీనియర్ నేతలు సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్‌ రావత్‌లలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే అవకాశం ఉంది. కనీసం కొత్త సిఎం అయినా శాసనసభ గడువు ముగిసేవరకు అంటే వచ్చే మార్చి వరకు పదవిలో కొనసాగుతారో లేదో చూడాలి.

తాజా సమాచారం: తీరధ్ సింగ్‌ రాజీనామా చేసిన తరువాత బిజెపి శాసనసభాపక్ష సమావేశంలో పుష్కర్ సింగ్‌ ధామి నాయకుడిగా ఎన్నుకోవడంతో ఆయన ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.


Related Post