టిఆర్ఎస్‌ మళ్ళీ సెంటిమెంట్ రాజేస్తోందా?

July 03, 2021


img

సాగర్ ఉపఎన్నికలో కె.జానారెడ్డి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న టిఆర్ఎస్‌కు ఈసారి హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఇంకా గట్టి పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, ఆయన వెనుక బిజెపిని ఎదుర్కోవలసి ఉంది. కొత్తగా రేవంత్‌ రెడ్డి కూడా రంగప్రవేశం చేయడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. 

ఈ ఉపఎన్నికలు సిఎం కేసీఆర్, ఈటల రాజేందర్‌, రేవంత్‌ రెడ్డిలకు అలాగే టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకంగా నిలుస్తాయి కనుక సాధారణ వ్యూహాలేవీ పనిచేయకపోవచ్చు. బహుశః అందుకే టిఆర్ఎస్‌ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ అనే బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసినట్లుంది. 

టిఆర్ఎస్‌ నుంచి ఈటల బయటకు వెళ్ళకమునుపు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ప్రాజెక్టు గురించి పెద్దగా మాట్లాడని టిఆర్ఎస్‌ మంత్రులు ఇప్పుడు రోజూ వంతులు వేసుకొన్నట్లుగా ఒకరి తరువాత ఒకరు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని, ఎప్పుడో చనిపోయిన ఆయన తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా తిట్టిపోస్తున్నారు. తండ్రీ కొడుకులిద్దరూ కలిసి తెలంగాణకు రైతులకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

విశేషమేమిటంటే, టిఆర్ఎస్‌ మంత్రులు ఇంతగా తిట్టిపోస్తుంటే ఏపీ సీఎం జగన్, ఆయన మంత్రులు ఏమాత్రం బాధపడకుండా వారిని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క వైఎస్ షర్మిల కూడా ఈ అగ్గిని రాజేస్తుండటం గమనిస్తే మూడు పార్టీలు కలిసి పరస్పర అవగాహనతోనే ఓ పద్దతిగా తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కానీ ఇటువంటి రాజకీయాలు చేయడం వలన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మద్య మళ్ళీ విద్వేషబీజాలు నాటుతున్నామని మూడు పార్టీలు పట్టించుకోవడం లేదు. తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నివిదాల అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నప్పుడు ఓ ఉపఎన్నికలలో గెలిచేందుకు తెలంగాణ సెంటిమెంట్‌ కూడా అవసరమా?అది లేకుండా గెలవలేమని టిఆర్ఎస్‌ భావిస్తోందా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.


Related Post