గెలిచి ఫిరాయిస్తే తరిమికొడతాం: రేవంత్‌ రెడ్డి

July 03, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలహీనపడటానికి ప్రధాన కారణం ఫిరాయింపులని అందరికీ తెలుసు. ఎన్నికలలో కాంగ్రెస్‌ తరపున పోటీ చేయడం గెలిస్తే టిఆర్ఎస్‌లో చేరిపోతుండటం పరిపాటిగా మారిపోయింది. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్ధులకు ఓట్లు వేసి గెలిపించినా వారు టిఆర్ఎస్‌లో చేరిపోతారనే భావన ప్రజలలో బలంగా నాటుకొంది. దాంతో వారు టిఆర్ఎస్‌ లేదా బిజెపి వైపు మొగ్గుచూపుతున్నారు. ఇది కాంగ్రెస్‌ పాలిట శాపంగా మారింది. కానీ కాంగ్రెస్‌ నేతలెవరూ ఈ సమస్య తీవ్రతను గుర్తించలేదో గుర్తించినా ఏమీ చేయలేమని భావిస్తున్నారో తెలీదు కానీ కాంగ్రెస్‌లో ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. 

కొత్తగా పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి ఈ సమస్యపై దృష్టి పెట్టారు. ముందుగా టిఆర్ఎస్‌లోకి ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాట్లాడి వీలైతే హైకోర్టులో పిటిషన్‌ వేయాలనుకొంటున్నట్లు చెప్పారు. ఇకపై పార్టీ టికెట్స్ ఇచ్చే ముందే అభ్యర్ధులు బలాబలాలతో పాటు గెలిచిన తరువాత పార్టీకి కట్టుబడి ఉంటారా లేదా దృవీకరించుకొంటామని చెప్పారు. అయినా గెలిచిన తరువాత పార్టీని వీడితే తెలంగాణ సరిహద్దుల వరకు తరిమి కొడతామని అన్నారు. ఇకపై బూత్ స్థాయి నుంచి హైదరాబాద్‌ వరకు కార్యకర్తలందరికీ అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, వారి కష్టనష్టాలను, బాధలను కూడా పార్టీ పంచుకొని వారికి అండగా నిలబడుతుందని రేవంత్‌ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికలలోగా కాంగ్రెస్‌ పార్టీని పునర్నిర్మించుకొని టిఆర్ఎస్‌ను ఓడించి అధికారంలోకి వస్తామని రేవంత్‌ రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. మరి ఈ ప్రయత్నాలలో రేవంత్‌ రెడ్డి ఎంతవరకు సఫలం అవుతారో కాలమే చెపుతుంది.


Related Post