అంతరిక్షంలో మన తెలుగు అమ్మాయి శిరీష

July 03, 2021


img

మన దేశం...మన రెండు తెలుగు రాష్ట్రాలు గర్వపడేలా చేస్తోంది అమెరికాలో స్థిరపడిన ఓ తెలుగు అమ్మాయి. ఆమె శిరీష బండ్ల. అమెరికాలోని ప్రైవేట్ స్పేస్ ఏజన్సీ ‘వర్జిన్ గెలాక్టిక్’ అధ్వర్యంలో ఈనెల 11న మొట్టమొదటి ‘కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్’ ద్వారా అంతరిక్షయానం చేయనున్న ఆరుగురు వ్యక్తులలో శిరీష కూడా ఒకరు. కల్పనా చావ్లా తరువాత అంతరిక్షంలో అడుగుపెడుతున్న రెండో మహిళగా శిరీష బండ్ల నిలిచిపోనుంది.


వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు, అధినేత రిచర్డ్ బ్రాన్‌సన్‌, శిరీష బండ్లతో కలిపి మొత్తం ఆరుగురు అంతరిక్షయానం చేయనున్నారు. శిరీష బండ్ల..ముగ్గురు స్పేస్ స్పెషలిస్టులలో ఒకరుకాగా మిగిలిన ఇద్దరు పైలట్లు. ఈ నెల 11వ తేదీ తెల్లవారుజామున న్యూమెక్సికో నుంచి వీరి కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ ‘యూనిటీ-22’ అంతరిక్షంలోకి దూసుకుపోతుంది. భూమిపై నుంచి 90 కిమీ ఎత్తులో ఉండే అంతరిక్ష పరిధిలోకి వీరి వ్యోమనౌక చేరుకొని అక్కడ కొంతసేపు విహరించిన తరువాత మళ్ళీ భూమికి తిరుగు ప్రయాణం అవుతుంది. అది సాధారణ విమానంలాగే భూమిపై ల్యాండింగ్ అవుతుంది. 

శిరీష బండ్ల తల్లి అనురాధ స్వస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలి. ఆమె భర్త డాక్టర్ మురళీధర్‌తో కలిసి హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. శిరీష బండ్ల నాలుగేళ్ళ వయసులో అక్కతో కలిసి అమెరికాకు వెళ్ళి అక్కడే చదువుకొని పెరిగి ఉద్యోగం చేస్తున్నారు.


చిన్నప్పటి నుంచే హ్యూస్టన్‌లోని అంతరిక్ష కేంద్రం చూస్తూ పెరిగిన శిరీష బండ్ల ఎప్పటికైనా అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనేది. అయితే ఆమెకు కంటి సమస్యలు ఉండటంతో నాసా ద్వారా ఆ కల ఎప్పటికీ నెరవేరదని త్వరగానే గ్రహించింది. కానీ కమర్షియల్ స్పేస్ జర్నీ రూపంలో ఆమె కలలు నెరవేరబోతున్నాయి. అందుకు ఆమె చదివిన చదువు, ఉద్యోగాలు, అనుభవం అన్నీ ఎంతగానో దోహదపడ్డాయి. 

ఆమె పర్‌డ్యూ యూనివర్సిటీలో ఏరోనాటికల్ అండ్ ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ చేసి కమర్షియల్ ఫ్లైట్ ఫెడరేషన్ సంస్థలో ఏరో స్పేస్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. అందులో పనిచేస్తూనే జార్జి వాషింగ్‌టన్‌ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. 2015లో వర్జిన్ గెలక్టిక్ సంస్థలో మేనేజరుగా చేరి తన ప్రతిభా పాఠవాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ సంస్థ వైస్‌-ప్రెసిడెంట్ అయ్యారు. అత్యంత క్లిష్టమైన ఈ బాధ్యతలు సమర్ధంగా నిర్వర్తిస్తూనే మరోపక్క అమెరికన్ ఆస్ట్రోనాటికల్ అండ్ ఫ్యూచర్ స్పేస్ లీడర్స్ ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా, పర్డ్యూ యూనివర్సిటీ యంగ్ ప్రొఫెషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. ఇప్పుడు అంతరిక్షయానం చేయనున్నారు. ఇవన్నీ ఆమె కేవలం 30 ఏళ్ళ వయసులోపే సాధించడం విశేషం. ఇటువంటి అసమాన ప్రతిభావంతురాలైన శిరీష బండ్లను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)2014లోనే గుర్తించి యూత్ స్టార్ అవార్డుతో ఘనంగా సత్కరించింది.


Related Post