భారత్‌పై పాక్‌ ద్రోణాయుధం... ఎదుర్కొనేదెలా?

July 02, 2021


img

పాక్‌ వక్రబుద్ది ఎప్పటికీ మారదని ఇటీవల జమ్మూ విమానాశ్రయంపై జరిగిన డ్రోన్ బాంబు దాడితో రుజువైంది. ఆ దాడి తరువాత కూడా రెండు మూడుసార్లు జమ్మూలో డ్రోన్లు తిరిగాయి. తాజాగా ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంపై కూడా డ్రోన్ సంచరించింది. దీనిపై భారత్‌ వెంటనే స్పందించి పాక్‌కు నిరసన తెలియజేసింది. ఇది భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తున్నట్లు హెచ్చరించింది. అయితే కుక్క తోక వంకరను ఎన్నటికీ సరికాదన్నట్లు పాక్‌ వక్ర బుద్దిని సరిచేయడం కూడా సాధ్యం కాదని స్పష్టమవుతోంది. కనుక పాక్‌ ఆగడాలను ఎదుర్కొనేందుకు భారత్‌ కూడా ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలి. 

నేటికీ కశ్మీర్‌లో వేర్పాటువాదులను, ఉగ్రవాదులను ప్రోత్సహించి విధ్వంసం సృష్టించేందుకు పాక్‌ కుట్రలు పన్నుతూనే ఉంది. అయితే కేంద్రప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంతో పాక్‌ ఆగడాలను కొంతవరకు నియంత్రించగలిగింది.

దాంతో పాక్‌ అందుబాటులోకి వచ్చిన డ్రోన్ల ద్వారా కశ్మీరులోకి ఆయుధాలు, మత్తుమందులు సరఫరాచేయడం ప్రారంభించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి డ్రోన్ల సాయంతో బాంబులు కూడా వేస్తూ మళ్ళీ విధ్వంసానికి పాల్పడుతోంది.

ద్రోన్లలతో బాంబులు జారవిడిచి విధ్వంసం సృష్టించడం నేర్చిన పాకిస్తాన్ కశ్మీరుకే పరిమితం అవుతుందని అనుకోలేము. మున్ముందు దేశంలో ప్రధాన నగరాలపై కూడా ఇటువంటి దాడులకు పాల్పడే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే ఇదివరకు ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.

హైదరాబాద్‌లో నేటికీ ఉగ్రవాదులు తిష్ట వేసి ఉన్నారని ఇటీవల ఇద్దరి అరెస్ట్ తో స్పష్టమైంది కనుక నగరానికి ఈ డ్రోన్ దాడుల ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కనుక హైదరాబాద్‌ పోలీసులు, నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.


Related Post