ఏడేళ్ళ క్రితం వరకు ఒకే రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుడు నీళ్ళ పంపకాలు, జలవిద్యుత్ ఉత్పత్తిపై భారత్-పాక్ దేశాల్లాగ కీచులాడుకొంటున్నాయి. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాల ప్రాజెక్టులలో నీళ్ళు తక్కువగా ఉన్నందున జల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.
దీంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ ప్రాజెక్టుల వద్ద భారీగా పోలీసులు మోహరించింది. ఏపీ ప్రభుత్వం కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులలో ఏపీవైపు పోలీసులను మోహరించింది. అలాగే కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టుల వద్ద పోలీసులను మోహరించింది. దీంతో ఆ ప్రాజెక్టుల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రాజెక్టుల వద్ద పోలీసులను మోహరించి ఎవరినీ అనుమతించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినతిపత్రాలు ఇచ్చేందుకు వస్తున్న ఏపీ అధికారులను తెలంగాణ పోలీసులు అడ్డుకొని వెనక్కు తిప్పి పంపిస్తున్నారు. ఈ సమస్యపై ఉన్నత స్థాయి అధికారులే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని నచ్చచెప్పి తిప్పి పంపిస్తున్నారు.
ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా అన్నదమ్ముల్లా ఎప్పటికీ కలిసే ఉంటామన్న ఆనాటి మాటలు ఇప్పుడు ఎవరికీ గుర్తులేవు. రెండు ప్రభుత్వాలు శతృదేశాల్లా కీచులాడుకొంటున్నాయి. పైగా సున్నితమైన ఈ సమస్యపై రెండు రాష్ట్రాలలో రాజకీయాలు కూడా మొదలవడంతో ఇంకా జటిలమవుతోంది. దీనికి పరిష్కారం ఎప్పుడో ఎవరికీ తెలీదు.