భట్టికి పిలుపు...ఢిల్లీ ప్రయాణం...దేనికో?

July 01, 2021


img

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో గురువారం హడావుడిగా ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి నియామకంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ భట్టి విక్రమార్క మాత్రం తన మనసులో ఆలోచనలను బయటపెట్టలేదు. ఇంతవరకు రేవంత్‌ రెడ్డికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల ఆయన 24 గంటల వ్యవధిలో రెండుసార్లు ప్రగతి భవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ను కలిసి రావడంతో అప్పుడే ఆయన పార్టీ మారుతారంటూ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొదటిసారి ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలిసి వెళ్ళి దళిత మహిళ మరియమ్మ కేసు గురించి మాట్లాడారు. ఆయన విజ్ఞప్తిపై సిఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించి వెంటనే మరియమ్మ మృతిపై విచారణకు ఆదేశించి ఆమె కుటుంబానికి ఆర్ధికసాయం ప్రకటించారు.

మర్నాడు ప్రగతి భవన్‌లో జరిగిన ముఖ్యమంత్రి దళిత సాధికార సమావేశానికి హాజరైన అఖిలపక్ష నేతలలో భట్టి విక్రమార్క కూడా ఒకరు. ఆ సమావేశంలో కూడా భట్టితో సహా ప్రతిపక్ష నేతలు చేసిన సూచనలపై సిఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు.

రేవంత్‌ రెడ్డి నియామకంతో అసంతృప్తిగా ఉన్న భట్టి విక్రమార్క టిఆర్ఎస్‌లో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ఆలోచింపదగ్గదే. ఆయన పార్టీ మారకుండా భుజ్జగించేందుకే సోనియా గాంధీ ఢిల్లీకి పిలిచారా లేదా పార్టీలో ఏదైనా కీలకపదవి కట్టబెట్టడానికి పిలిచారా లేదా రేవంత్‌ రెడ్డికి సహకరించమని వార్నింగ్ ఇచ్చేందుకు పిలిచారా?అనేది త్వరలోనే తెలుస్తుంది.


Related Post