ప్రజలెలా బ్రతుకుతారో చూస్తామంటున్న పెట్రోలియం కంపెనీలు

July 01, 2021


img

ఇప్పుడు భారత్‌లో సామాన్య, మద్యతరగతి ప్రజలకు జీవితం దినదినగండంగా మారిపోయింది. కరోనా, లాక్‌డౌన్‌లతో చాలామంది జీవితాలు ఛిద్రం అయ్యి నానా కష్టాలు పడుతుంటే మరోపక్క పెట్రోలియం కంపెనీలు నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ అప్పుడే రూ.103కు చేరుకొంది. పెట్రోల్, డీజిల్‌పై భారీగా పన్నురూపంలో ఆదాయం వస్తుండటంతో పెరుగుతున్న ధరలపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించడంలేదు. దీంతో ప్రజలు ఎంత ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నా పెట్రోలియం కంపెనీలు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ప్రతీరోజూ 25-35 పైసలు చొప్పున యధేచ్చగా ధరలు పెంచుకొంటున్నాయి. 

వంట గ్యాస్ సిలెండర్ ధరలు కూడా వాటి చేతిలోనే ఉండటంతో వాటినీ నెలనెలా పెంచేస్తున్నాయి. తాజాగా 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.25 చొప్పున పెంచేశాయి. దీంతో హైదరాబాద్‌లో ఒక్కో సిలెండర్ ధర రూ.887కి చేరుకొంది. సామాన్య ప్రజలు ఏవిధంగా బ్రతుకారో చూస్తాం... అన్నట్లు పెట్రోలియం కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే, వాటిని నియంత్రించి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాల్సిన కేంద్రప్రభుత్వం, ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు కనుక కళ్ళు మూసుకొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ తప్పించుకొంటున్నాయే తప్ప ఈ ధరల తగ్గింపుకి ఎటువంటి ప్రయత్నమూ చేయడం లేదు. కనుక దేశంలో సామాన్య మధ్యతరగతి ప్రజల గోడు వినే నాధుడే లేడు. ఇక వారికి దేవుడే దిక్కు.


Related Post