ఏడేళ్ళుగా ఈటల జమ్మికుంటను పట్టించుకోలేదు: గంగుల

July 01, 2021


img

ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌ ఉపఎన్నికలు రానున్నాయి. కనుక ఆ స్థానాన్ని దక్కించుకొనేందుకు టిఆర్ఎస్‌ ప్రభుత్వం అప్పుడే ఆ నియోజకవర్గంపై వరాల వాన కురిపిస్తోంది. మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్ ఇద్దరూ బుదవారం జమ్మికుంట పట్టణంలో పర్యటించి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, “ఈటల రాజేందర్‌ గత ఏడేళ్ళుగా జమ్మికుంట పట్టణం అభివృద్ధి పట్టించుకోలేదు. మేము పట్టణ సమస్యలను సిఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి రూ.31 కోట్లు నిధులు సాధించుకొచ్చాము. పట్టణంలో అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచ్చాము. ఈనెల 12వ తేదీ నుంచే పనులు ప్రారంభం అవుతాయి. ఇక నుంచి జమ్మికుంట అభివృద్ధికి మేమే బాధ్యత తీసుకొని పనులు పూర్తి చేయిస్తాము,” అని అన్నారు. 

సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పని రోజంటూ లేదు. కానీ ఏడేళ్ళుగా జమ్మికుంటలో అభివృద్ధి జరుగలేదని ఇప్పుడు మంత్రులే స్వయంగా చెప్పుకొంటున్నారు. అయితే దానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బాధ్యుడని వాదిస్తున్నారు. ఇకపై జమ్మికుంట అభివృద్ధికి తాము బాధ్యతవహిస్తామని హామీ ఇస్తున్నారు. ఒకవేళ హుజూరాబాద్‌ ఉపఎన్నికలు లేకుంటే మంత్రులు జమ్మికుంటకు వచ్చేవారా...అభివృద్ధి పనులు ఇంతవేగంగా మొదలయ్యేవా?అంటే కాదనే చెప్పవచ్చు. ఒకవేళ ఈ ఉపఎన్నికలలో ఈటల రాజేందర్‌ లేదా కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలిచినా ఇప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రులు హామీ ఇవ్వగలరా?


Related Post