వైఎస్ షర్మిలకు తలనొప్పులు...ఊహించినవే

June 30, 2021


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయప్రవేశం చేయడం చాలా విడ్డూరంగానే ఉంది. దీంతో ఆమె ఏమి సాధించదలిచారో తెలీదు కానీ ఆమె ఇంకా పార్టీని ప్రారంభించక మునుపే అప్పుడే తలనొప్పులు ప్రారంభం అయ్యాయి. అయితే ఇవి ఊహించినవే అని చెప్పవచ్చు. 

నీళ్ళ పంపకాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు మద్య మళ్ళీ గొడవలు మొదలైనందున, ఇప్పుడు ఆమె పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు నీళ్ళ విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో దేనికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఆమె మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణలో ఆమె పార్టీ మనుగడ సాగించాలంటే తప్పనిసరిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడవలసి ఉంటుంది. కనుక నీళ్ళ కేటాయింపులలో తెలంగాణకు అన్యాయం జరిగితే సహించనని ఇటీవల ఆమె ట్వీట్ చేశారు. అది ఏపీలోని రైతులకు ఆగ్రహం కల్పించింది. దాంతో వారు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కె. శ్రీనివాసులు అధ్యర్యంలో బుదవారం హైదరాబాద్‌ చేరుకొని ఆమె లోటస్‌పాండ్‌ నివాసం ఎదుట నిరసనలు తెలియజేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారికీ అక్కడే ఉన్న వైఎస్ షర్మిల అనుచరులకి మద్య తీవ్ర వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. పోలీసులు కలుగజేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టి, ఆందోళనకారులను బంజారా హిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

అయితే ఇక్కడితో ఈ సమస్య సమసిపోదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య ఎటువంటి సమస్యలు తలెత్తినా ఆమెకు ఇదేవిదంగా సమస్యలు ఎదుర్కోక తప్పదు. మరి ఆమె అందుకు సిద్దపడే వచ్చారో లేదో కాలమే చెపుతుంది.


Related Post