సిఎం కేసీఆర్‌కి పక్కలో బల్లెం..ఒకటి కాదు...అనేకం

June 30, 2021


img

రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు రాజకీయ శత్రువులు ఉండొద్దనే ఆ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలను ఆకర్షించి ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. కానీ రాష్ట్రంలో సిఎం కేసీఆర్‌కు, టిఆర్ఎస్‌కు రాజకీయ శత్రువులు తగ్గకపోగా నానాటికీ పెరుగుతూనే ఉన్నారు. 

ఇక తిరుగేలేదనుకొన్న టిఆర్ఎస్‌ను ఎన్నికలలో దెబ్బ తీస్తూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ సిఎం కేసీఆర్‌కు పక్కలో బల్లెంగా మారగా, ఈటల రాజేందర్‌ను బయటకు పంపించి సిఎం కేసీఆర్‌ చేజెతులా మరో బలమైన శత్రువును తయారుచేసుకొన్నట్లయింది. ఒంటరి పోరాటం మొదలుపెట్టిన ఈటల బిజెపిలో చేరడంతో ఆయన బలం మరింత పెరిగింది. 

సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో ఆయన కూడా సిఎం కేసీఆర్‌ను ఢీకొనేందుకు సై అంటున్నారు. కాంగ్రెస్‌, బిజెపిలు రాజకీయంగా బద్ద శత్రువులే అయినప్పటికీ రెంటికీ ఉమ్మడి శత్రువు కేసీఆరే కావడంతో రెండూ వేర్వేరు మార్గాలలో సిఎం కేసీఆర్‌ను గద్దె దించాలనే ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో ఇది రుజువు కాబోతోంది.  

బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, రేవంత్‌ రెడ్డి ముగ్గురే కాకుండా ప్రొఫెసర్ కోదండరాం, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి వంటి మరికొందరు కూడా సిఎం కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారందరి లక్ష్యం కూడా సిఎం కేసీఆర్‌ను గద్దె దించడమే. దీంతో రాష్ట్రంలో సిఎం కేసీఆర్‌కు, టిఆర్ఎస్‌కు బలమైన రాజకీయ శత్రువుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. 

అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా సిఎం కేసీఆర్‌ ఇటువంటి సవాళ్ళను ధీటుగా ఎదుర్కొని బయటపడ్డారు. ఈ ఏడేళ్ళలో ఆయన, టిఆర్ఎస్‌ పార్టీ కూడా మరింత బలపడ్డాయి. సిఎం కేసీఆర్‌కు సైన్యంలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌, తలసాని, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, కొప్పుల, పువ్వాడ, ఇంకా బాల్క సుమన్, కల్వకుంట్ల కవిత, కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి డజన్ల కొద్దీ యోధానుయోధులున్నారు. అపర చాణక్యుడిగా పేరొందిన వారి నాయకుడు సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఇంకా ఎంతమంది శత్రువులనైనా అవలీలగా ఎదుర్కోగల సామర్ధ్యం కూడా ఉంది. కనుక రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వారి మద్య భీకరమైన రాజకీయ యుద్ధాలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. 


Related Post