రాణీగంజ్ డిపో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

June 30, 2021


img

హైదరాబాద్‌ రాణీగంజ్-1 ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవరుగా పని చేస్తున్న తిరుపతి రెడ్డి (52) మంగళవారం డిపో మేనేజర్ ఎదుటే పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆయన శలవు పెట్టకుండా రెండు రోజులు విధులకు హాజరుకాకపోవడంతో మూడో రోజు డ్యూటీకి వచ్చినప్పుడు డిపో సిఐ విజయ్ కుమార్ ఆయనను అనుమతించలేదు. డిపో మేనేజరును కలిసి సంజాయిషీ చెప్పుకొని అనుమతి తీసుకొని రావాలని చెప్పడంతో అప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న తిరుపతి రెడ్డి మనస్తాపంతో డిపో మేనేజర్ ఎదుటే పురుగుల మందు త్రాగి పడిపోయాడు. అక్కడే ఉన్న తోటి ఉద్యోగులు వెంటనే ఆర్టీసీ బస్సులోనే గాంధీ ఆసుపత్రికి అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించినప్పటికీ తిరుపతి రెడ్డి దారిలోనే మరణించాడు. 

టీఎస్‌ఆర్టీసీ పరిస్థితి మొదటి నుంచే అంతంతమాత్రంగా ఉండేది. కార్మికుల 55 రోజుల సమ్మె తరువాత వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆ తరువాత వరుసగా రెండుసార్లు లాక్‌డౌన్‌లు, దాంతో సకాలంలో జీతాలు అందక పోవడం, ఎవరికి ఎప్పుడు ఏ విధులు కేటాయిస్తారో తెలీని పరిస్థితి, మరోపక్క చాలామంది కార్మికుల కుటుంబాలు ఆర్ధిక సమస్యలు, కరోనాతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండటం, కార్గో, పార్సిల్ సర్వీసులకు కేటాయించబడిన డ్రైవర్లు, కండెక్టర్లు అలవాటులేని హమాలీ పని చేయవలసిరావడం వంటి అనేక సమస్యలతో తీవ్ర ఒత్తిళ్ళకు లోనవుతున్నారు. టీఎస్‌ఆర్టీసీ కార్మికులు ఇంత నిరాశానిస్పృహలు, ఒత్తిళ్ళు ఏనాడూ ఎదుర్కోలేదు. పైగా ఇప్పుడు ఉద్యోగభద్రత విషయంలో కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కానీ వారి గోడు వినే నాధుడు లేకపోవడంతో ఏమి చేయాలో పాలుపోక మౌనంగా వేదన అనుభవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాడిన టీఎస్‌ఆర్టీసీ కార్మికులు ఇటువంటి దయనీయమైన స్థితిలో ఉండటం ఆత్మహత్యలు చేసుకొంటుండటం చాలా బాధాకరం.


Related Post