పాక్‌ డ్రోన్లను అడ్డుకొనేందుకు ఇంద్రజాల్ సిద్దం చేసిన హైదరాబాద్‌ కంపెనీ

June 29, 2021


img

ఇదివరకు ఉగ్రవాదులు బహిరంగ ప్రదేశాలలో బాంబులు అమర్చి పేల్చుతూ మారణఖాండకు పాల్పడేవారు. కానీ సీసీ కెమెరాలు వచ్చిన తరువాత వారిని గుర్తించి అరెస్ట్ చేస్తుండటంతో దేశంలో వారి దుశ్చర్యలు చాలా వరకు తగ్గాయి. కానీ ఇప్పుడు డ్రోన్లు రావడంతో మళ్ళీ కొత్త సమస్య మొదలైంది. 

రెండు రోజుల క్రితం జమ్మూలోని కట్టుదిట్టమైన భద్రత కలిగిన విమానాశ్రయంపై గుర్తు తెలియనివ్యక్తులు డ్రోన్ ద్వారా బాంబులు జారవిడిచి రెండు ప్రేలుళ్ళు జరిపారు. అదృష్టవశాత్తు ఆ ప్రేలుళ్ళలో ప్రాణనష్టం జరుగలేదు. కానీ ఈ తరహా దాడి జరిగితే అది ఎంత ప్రమాదకరమో అర్దమయ్యేలా చేసింది. 

గాలిలో ఎగురుతూ వచ్చే డ్రోన్లను గుర్తించేందుకు, అడ్డుకొనేందుకు, కూల్చివేసేందుకు మన వద్ద ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం చాలా ఆందోళనకరమైన విషయమే. అయితే ఈ సమస్యను చాలా కాలం క్రితమే గుర్తించిన మన రక్షణశాఖలోని కొందరు విశ్రాంత అధికారులు అధ్వర్యంలో హైదరాబాద్‌లో గ్రీన్‌ రోబోటిక్స్ అనే స్టార్ట్-అప్‌ కంపెనీని స్థాపించి దానిలో ‘ఇంద్రజాల్’ అనే పేరుతో ఓ యాంటీ డ్రోన్ యంత్రాన్ని, వ్యవస్థను తయారుచేశారు. 

యాంటీ డ్రోన్ వ్యవస్థను చాలా తక్కువ ఖర్చుతో సరిహద్దులలో ఏర్పాటు చేసుకోవచ్చు. కృత్రిమమేధతో పనిచేసే ఈ నిఘా వ్యవస్థ పగలు, రాత్రి అనే తేడా లేకుండా శతృదేశాల డ్రోన్లను పసిగట్టి ఇంద్రజాల్‌కు సమాచారం అందిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా అది శతృదేశాల డ్రోన్‌ను గుర్తించి శక్తివంతమైన లేజర్ కిరణాలతో దానిని ధ్వంసం చేస్తుంది. సుమారు 2,000 కిమీ పరిధిలో దీనిని వినియోగించుకోవచ్చు కనుక సరిహద్దు రక్షణకు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని గ్రీన్‌ రోబోటిక్స్ ప్రతినిధులు చెప్పారు. ఇంద్రజాల్ అనే ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ తక్కువ ఎత్తులో ఎగిరే శతృదేశాల డ్రోన్లనే కాకుండా మానవ రహిత విమానాలను కూడా అవలీలగా గుర్తించి కూల్చివేయగదని వారు చెప్పారు. ప్రస్తుతం భారత్‌ రక్షణ దళాలు వినియోగిస్తున్న కంప్యూటర్, సరిహద్దు భద్రత తదితర వ్యవస్థలతో ఇంద్రజాల్‌ను సులువుగా అనుసంధానం కూడా చేసుకోవచ్చునని చెప్పారు. ఇటువంటి అత్యాధునిక వ్యవస్థ కోసమే ఎదురుచూస్తున్న భారత్‌ రక్షణశాఖకు మన హైదరాబాద్‌ కంపెనీ సమయానికి ఈ ఇంద్రజాల్‌ను తయారుచేసి అందిస్తుండటం మన అందరికీ గర్వకారణమే కదా? 


Related Post