జీహెచ్‌ఎంసీ వర్చువల్ సమావేశంపై బిజెపి ఆగ్రహం

June 29, 2021


img

జీహెచ్‌ఎంసీ చరిత్రలో తొలిసారిగా వర్చువల్ విధానంలో నేడు పాలకమండలి సమావేశం జరుగుతోంది. మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తరువాత తొలి సమావేశాన్ని ప్రత్యక్షంగా నిర్వహించకుండా ఆన్‌లైన్‌లో వర్చువల్ పద్దతిలో నిర్వహించడాన్ని బిజెపి తప్పు పడుతోంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిందని ప్రభుత్వమే లాక్‌డౌన్‌ ఎత్తివేసిందని, సాక్షాత్ సిఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనలు చేస్తూ ప్రజలతో కలిసి కూర్చొని సామూహిక భోజన కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు జీహెచ్‌ఎంసీ తొలి పాలకమండలి సమావేశాన్ని కరోనా సాకుతో వర్చువల్‌గా నిర్వహించడం ఏమిటని బిజెపి కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ గత పాలకమండలి ఆమోదించిన 2021-2022 బడ్జెట్‌పై సమావేశంలో లోతుగా చర్చించకుండా తప్పించుకొనేందుకే మేయర్ ఈ సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహిస్తున్నారని ఉప్పల్ కార్పొరేటర్ రజిత ఆరోపించారు. హైదరాబాద్‌ సమస్యల గురించి లోతుగా చర్చించాలంటే ప్రత్యక్ష పద్దతిలోనే పాలకమండలి సమావేశం నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. సమస్యల గురించి బిజెపి సభ్యులు జీహెచ్‌ఎంసీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతోనే ఈ విదానం ఎంచుకొని ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మేయర్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిజెపి మునిసిపల్ కమీషనర్‌ లోకేశ్ కుమార్‌కు ఓ లేఖ కూడా వ్రాసింది. కానీ ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి వర్చువల్ పద్దతిలో జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశం జరుగుతోంది. ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో 48 వార్డులు గెలుచుకొన్న బిజెపి, పాలకమండలి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని భావిస్తే వారికి ఆ అవకాశం ఇవ్వకుండా టిఆర్ఎస్‌ వర్చువల్ సమావేశం నిర్వహిస్తోంది.


Related Post