హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎవరో?

June 29, 2021


img

పిసిసి అధ్యక్షుడుగా ఎంపికైన రేవంత్‌ రెడ్డి జూలై 7వ తేదీన బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు. ఆలోగా పార్టీలో సీనియర్లందరినీ కలిసి పార్టీని నడిపించడంలో తనకు సహకరించవలసిందిగా కోరుతున్నారు. ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ హుజూరాబాద్‌ ఉపఎన్నికలకు సిద్దం అవుతున్న కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి సోమవారం రేవంత్‌ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం వారిరువురూ హుజూరాబాద్‌ ఉపఎన్నికల గురించి సుమారు గంటసేపు మాట్లాడుకొన్నారు.

ఈ ఉపఎన్నికలలో సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌,   ఈటల రాజేందర్‌, బిజెపిలకు కూడా చాలా ప్రతిష్టాత్మకమైనవే కనుక ఎలాగైనా గెలిచేందుకు ఇరువర్గాలు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్ధిని గెలిపించుకోవడం చాలా కష్టమే. కానీ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి ఎంపికైన తరువాత జరుగబోతున్న మొట్టమొదటి ఎన్నికలు కనుక ఇవి ఆయనకు కూడా చాలా ప్రతిష్టాత్మకమైనవే. కనుక నెలరోజులు ముందుగానే హుజూరాబాద్‌లో మకాం వేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని రేవంత్‌ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి లేదా పొన్నం ప్రభాకర్‌లలో ఎవరో ఒకరిని బరిలో దింపాలని రేవంత్‌ రెడ్డి యోచిస్తున్నట్లు తాజా సమాచారం. అయితే బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ  సీనియర్లతో మాట్లాడి అభ్యర్ధిని, ఎన్నికల వ్యూహాలను ఖరారు చేస్తానని రేవంత్‌ రెడ్డి చెప్పారు.


Related Post