రేవంత్‌ ఎంపిక బిజెపికి కూడా ఇబ్బందే

June 28, 2021


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా బండి సంజయ్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో బిజెపి చాలా దూకుడుగా వ్యవహరిస్తూ కొన్ని విజయాలు అందుకొంది. ఈటల రాజేందర్‌ చేరికతో హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో మరోసారి సత్తా చాటుకోవాలని తహతహలాడుతోంది. ఇటువంటి సమయంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నియామకం బిజెపికి కాస్త ఇబ్బందికరమే అని చెప్పవచ్చు.

రేవంత్‌ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన చిచ్చు మరికొన్ని రోజులలో సమసిపోవడం ఖాయం. ఓటుకు నోటు కేసులో తనను ఇరికించినందుకు సిఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి ప్రతీకారం రగిలిపోతున్నారు. ఎప్పటికైనా ఆయనను గద్దె దించుతానని ఆనాడే శపధం చేశారు. ఆ దిశలో ముందుకు సాగుతూ ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఎదిగారు. కనుక ఇక నుంచి తన లక్ష్య సాధన కోసం రేవంత్‌ రెడ్డి మరింత గట్టిగా ప్రయత్నించడం ఖాయం. ఇప్పటి వరకు రేవంత్‌ రెడ్డి చేసిన పోరాటాలు వేరు ఇకపై పిసిసి అధ్యక్షుడిగా చేయబోయే పోరాటాలు వేరు అని చెప్పక తప్పదు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నట్లు చెప్పారు. పార్టీలో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇంతవరకు పార్టీ కార్యకర్తలు చాలా కష్టనష్టాలు అనుభవించారని, ఇకపై వారందరితో కలిసి ఉద్యమస్థాయిలో కేసీఆర్‌ ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని అన్నారు. 

ఆగమ్యగోచరంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఆకర్షించగల, సిఎం కేసీఆర్‌ను ధైర్యంగా ఢీకొనగల రేవంత్‌ రెడ్డి వంటి బలమైన నాయకుడు రావడంతో మళ్ళీ కాంగ్రెస్‌, బిజెపిల మద్య రెండో స్థానం కోసం పోటీ మొదలవుతుంది. కనుక రేవంత్‌ రెడ్డి నియామకాన్ని బిజెపి జీర్ణించుకోవడం కష్టమే.


Related Post