కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు...తీసుకోగలదా?

June 28, 2021


img

పిసిసి అధ్యక్ష పదవిని రేవంత్‌ రెడ్డికి కట్టబెట్టడంపై తీవ్ర ఆగ్రహంతో ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టికి వెళ్ళడంతో వెంటనే ఆ వివరాలను పంపించమని ఆదేశించింది. ‘పిసిసి అధ్యక్ష పదవిని ఓటుకు నోటు కేసులా మానిక్కం టాగూర్ రేవంత్‌ రెడ్డికి అమ్ముకొన్నారని, కనుక భవిష్యత్‌లో కాంగ్రెస్‌ పార్టీ కూడా టి-టిడిపిలాగే రాష్ట్రంలో కనుమరుగుకానుంది...’అంటూ కోమటిరెడ్డి నిన్న మీడియాతో మాట్లాడిన మాటలకు సంబందించి వీడియో క్లిప్పింగులను, పేపర్లలో వచ్చిన ఆ వార్తలను హిందీలోకి అనువాదం చేసి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తమ అధిష్టానానికి పంపించారు. 

కోమటిరెడ్డి వ్యాఖ్యలను కొత్తగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన ఏ.మహేశ్వర్ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్లు షబ్బీర్ ఆలీ, మల్లు రవి ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవలసిందిగా అధిష్టానాన్ని కోరుతామని అన్నారు. 

రేవంత్‌ రెడ్డి నియామకంతో ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని కాంగ్రెస్ అధిష్టానానికి ముందే తెలిసినా ఇందుకు సిద్దపడే రేవంత్‌ రెడ్డిని ఎంపిక చేసింది. కనుక ఇప్పుడు రేవంత్‌ రెడ్డికి అండగా నిలబడేందుకు పార్టీలో ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి వంటివారిని నియంత్రించే ప్రయత్నం చేయవచ్చు. కానీ ఎంపీగా ఉన్న ఆయనను బయటకు పంపితే పార్టీకే నష్టం కనుక హెచ్చరికతో సరిపెట్టి ఆ తరువాత ఆయన పార్టీ వీడకుండా బుజ్జగించే ప్రయత్నాలు చేయవచ్చు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహుశః దీని కోసమే ఇంతకాలం బీజేపీలో చేరకుండా వేచి చూస్తున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి సోదరులిద్దరూ బీజేపీలో చేరినా ఆశ్చర్యం లేదు.


Related Post