కాంగ్రెస్‌లో కూడా ఓటుకు నోటు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

June 28, 2021


img

పిసిసి అధ్యక్షుడుగా రేవంత్‌ రెడ్డి నియామకంతో ఊహించినట్లే పార్టీలో ఆయన అనుకూల, వ్యతిరేక వర్గాల మద్య యుద్ధం మొదలైంది. అందరికంటే ముందుగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి రేవంత్‌ రెడ్డి నియామకాన్ని నిరసిస్తూ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఏఐసీసీ సభ్యత్వానికి నిన్న రాజీనామా చేశారు. పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్‌ పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. 

పిసిసి పదవి కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించి విఫలమైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిన్న ఢిల్లీ నుండి హైదరాబాద్‌ తిరిగిరాగానే కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఓటుకు నోటు కేసు మాదిరిగానే కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ పదవిని మాణిక్కం టాగూర్ అమ్ముకొన్నారు. కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా టిడిపిలాగే కనుమరుగవచ్చు. కొత్తగా ఎన్నికైన పిసిసి కమిటీ సభ్యులను అభినందిస్తున్నాను. అందరూ కలిసికట్టుగా పనిచేసి త్వరలో హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కించుకొనేలా కృషి చేయాల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మొదటి నుంచి పార్టీలో ఉన్న నాకు అన్యాయం జరిగింది. సోమవారం నుంచి ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేపట్టబోతున్నాను. నా ఏడు నియోజకవర్గాలలో పర్యటిస్తూ నిత్యం ప్రజల మద్యే ఉంటూ కొత్త నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహిస్తా. ఎంపీగా పార్లమెంటులో నా గొంతు వినిపిస్తా,” అని అన్నారు.


Related Post