రేవంత్‌ నియామకంతో కాంగ్రెస్‌ బలపడుతుందా...చీలిపోతుందా?

June 27, 2021


img

కాంగ్రెస్‌ అధిష్టానం మల్కాజిగిరీ ఎంపీ రేవంత్‌ రెడ్డిని తెలంగాణ పిసిసి అధ్యక్షుడుగా నియమించింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రెండు కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. 1. ఆయన సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపడి వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం. 2. పార్టీ నిలువునా రెండుగా చీలిపోయీ మరింత బలహీనపడటం. 

రేవంత్‌ రెడ్డి మంచి సమర్ధుడైన, ధైర్యవంతుడైన రాజకీయనాయకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లను ధైర్యంగా విమర్శించే అతికొద్ది మందిలో ఆయన అగ్రస్థానంలో నిలుస్తారు. బహుశః ఈ కారణంగానే కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనను ఈ పదవికి ఎంపిక చేసి ఉండవచ్చు. ఆయన సారధ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్‌ను బలంగా ఢీకొంటూ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ అధిష్టానం భావించి ఉండవచ్చు. ఒకవేళ రేవంత్‌ రెడ్డి నిజంగా ఆ పని చేయగలిగితే ఆయన అంత గొప్ప నాయకుడు మరొకరు లేరనే చెప్పుకోవచ్చు.  

అయితే పార్టీలో సీనియర్ నేతలలో చాలా మంది బహిరంగంగానే రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించబోమని ఇదివరకే చెప్పారు. ఒకవేళ ఆయనకే పగ్గాలు అప్పగిస్తే తాము పార్టీ విడిచి వెళ్లిపోతామని కూడా హెచ్చరించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వి.హనుమంతరావు, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, మధూ యాష్కీ, గీతారెడ్డి వంటి అనేకమంది హేమాహేమీలు ఉండగా వారినందరినీ కాదని టిడిపి నుంచి వచ్చి పార్టీలో చేరిన రేవంత్‌ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడం ఏమిటని చాలా మంది సీనియర్ నేతలు బహిరంగంగానే ప్రశ్నించారు. పైగా ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న రేవంత్‌ రెడ్డిని పార్టీ అధ్యక్షుడుగా నియమించడం సరికాదని వాదించేవారూ ఉన్నారు. 

ఈ నేపధ్యంలో పార్టీలో రేవంత్‌ రెడ్డిని వ్యతిరేకిస్తున్నవారందరూ చేతులు కలిపితే పార్టీ నిలువునా చీలిపోయే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే రేవంత్‌ రెడ్డి నియామకంతో పార్టీ బలోపేతం కాకపోగా పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు పార్టీలో సీనియర్లు అందరూ మౌనంగా ఆయన నాయకత్వాన్ని అంగీకరించినప్పటికీ, వారు ఆయనకు సహాయనిరాకరణ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో రేవంత్‌ రెడ్డి ఓ పక్క పార్టీలో తన వ్యతిరేక వర్గాన్ని ఎదుర్కొంటూనే బయట టిఆర్ఎస్‌ను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక రేవంత్‌ రెడ్డి పట్టుబట్టి తెలివిగా  ఈ పదవి సాధించుకొన్నప్పటికీ ఇది ఆయనకు ముళ్ళ కిరీటం వంటిదేనని చెప్పవచ్చు. మరి ఆయన ఈ సమస్యలన్నిటినీ అధిగమించి ఏవిదంగా నెగ్గుకువస్తారో చూడాలి.


Related Post