అది ఈటల విమర్శల ప్రభావమేనా?

June 26, 2021


img

ఈటల రాజేందర్‌ టిఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి సిఎం కేసీఆర్‌ వైఖరిపై చేస్తున్న విమర్శలు అందరూ వింటూనే ఉన్నారు. వాటిలో నిజానిజాలు, భిన్నాభిప్రాయాలను పక్కన పెడితే వాటి ప్రభావం సిఎం కేసీఆర్‌పై ఎంతో కొంత పడినట్లే కనిపిస్తోంది. అందుకు కొన్ని తాజా నిదర్శనాలు కనిపిస్తున్నాయి. 

వాటిలో మొట్టమొదటగా చెప్పుకోవలసింది కాంగ్రెస్‌ నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చి మరియమ్మ  కేసులో వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించడం. టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా సిఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ లభించడం చాలా కష్టమని ఈటల రాజేందర్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. అలాగే సిఎం కేసీఆర్‌ ఏనాడూ ప్రతిపక్ష నేతలకు ముఖ్యంగా కాంగ్రెస్‌ నేతలు, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ తొలిసారిగా కాంగ్రెస్‌ నేతలు అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడమే కాక వారి విజ్ఞప్తులపై వెంటనే సానుకూలంగా స్పందించడం చాలా ఆశ్చర్యకరమే. 

సిఎం కేసీఆర్‌ ఎప్పుడూ ప్రగతి భవన్‌కు లేదా ఫాంహౌసుకే పరిమితమవుతారని, కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న సమయంలో కూడా ఆయన ఏనాడూ ఆసుపత్రులను సందర్శించలేదని, రోగులకు, ప్రజలకు భరోసా ఇవ్వలేదని, కానీ తాను తరచూ ఆసుపత్రులను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపట్టేవాడినని ఈటల రాజేందర్‌ చెప్పుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. బహుశః అందుకే సిఎం కేసీఆర్‌ ఆసుపత్రులు, జిల్లాలు, వాసాలమర్రి పర్యటనలు చేసినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. 

కారణాలు ఏవైనప్పటికీ సిఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనలు చేస్తూ ప్రజల మద్యకు వస్తుండటంపై టిఆర్ఎస్‌ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సిఎం కేసీఆర్‌ పర్యటనలతో టిఆర్ఎస్‌ శ్రేణులలో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఇది త్వరలో జరుగబోయే హుజూరాబాద్‌ ఉపఎన్నికలకు చాలా ఉపయోగపడుతుంది కూడా.


Related Post