బుల్లెట్ స్పీడుతో చైనా...రాజకీయాలలో భారత్‌ తలమునకలు!

June 25, 2021


img

చైనా రాజ్య విస్తరణ కాంక్ష చాలా ఎక్కువ. అందుకే అది ఎప్పుడూ ఇరుగుపొరుగు దేశాలను, చివరికి సముద్రాలను కూడా కబళించడానికి ప్రయత్నిస్తుంటుంది. భారత్‌ సరిహద్దుకు అతి సమీపం వరకు బులెట్ ట్రైన్ ఏర్పాటు చేసుకోవడం కూడా ఆ ప్రయత్నాలలో భాగమే అని చెప్పవచ్చు.  

భారత్‌లో ఇంకా మొట్టమొదటి బులెట్ ట్రైన్ మరో మూడేళ్ళ తరువాత గానీ సిద్దం అవదు. కానీ చైనా ఏడేళ్ళ క్రితమే భారత్‌ సరిహద్దువరకు బులెట్ ట్రైన్ నడిపించేందుకు పనులు మొదలుపెట్టి ఇటీవలే పూర్తి చేసి ఆ మార్గంలో తొలి బులెట్ ట్రైన్‌ను ప్రారంభించేసింది కూడా! 

చైనాలోని లాస్లా నగరం నుంచి అరుణాచల్ ప్రదేశ్‌ సరిహద్దుకు అతి సమీపంలో ఉండే తూర్పు టిబెట్‌లోని నింగ్‌చి అనే ప్రాంతం వరకు చైనా ఓ బులెట్ ట్రైన్‌ను ప్రారంభించింది. మొత్తం 435.5 కిమీ పొడవున్న ఈ బులెట్ ట్రైన్‌ మార్గం అందుబాటులోకి రావడంతో గతంలో 48 గంటలు పట్టే ప్రయాణానికి ఇప్పుడు కేవలం 13 గంటలే పడుతుంది. దీంతో చైనా సైనికులను, తేలికపాటి ఆయుధాలను చాలా తక్కువ సమయంలోనే భారత్‌ సరిహద్దులకు చేరవేయవచ్చు. ఈ బులెట్ ట్రైన్‌ సరిహద్దు వద్ద స్థిరత్వన్ని కాపాడుకోవడంలో చాలా కీలకమైనదని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అని  చెప్పడం గమనిస్తే అది కూడా యుద్ధసన్నాహాలలో ఒకటి అని స్పష్టమవుతోంది. 

చైనా ఇంతగా రాజ్యవిస్తరణ కాంక్షతో రగిలిపోతుంటే భారత్‌లోని అధికార, ప్రతిపక్ష రాజకీయనాయకులు అందరూ ఇదేమీ గమనించనట్లు ఎప్పుడూ రాజకీయాలలో తలమునకలై ఉంటారు.


Related Post