ప్రతీ ఎన్నికలూ ప్రతిష్టాత్మకమేనా...ఎందుకు?

June 25, 2021


img

ఒకప్పుడు ఎన్నికలలో గెలిచేందుకు రాజకీయ నాయకులు డబ్బు, మద్యం పంచేవారు. ఆచరించని హామీలు ఇచ్చేవారు. నేటికీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటితో పాటు ప్రత్యర్ధులను రాజకీయంగా, నైతికంగా దెబ్బతీసేందుకు కుట్రలు పన్నడం, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం, ప్రత్యర్ధులకు అనుకూలంగా ఉన్న లేదా ఉంటారని భావిస్తున్నవారిపై సామాధానభేదదండోపాయాలు ప్రయోగించి లొంగదీసుకోవడం, అధికార పార్టీలైతే సంక్షేమ పధకాలు, కాంట్రాక్టులు ఎరగా వేయడం లేదా అవి ఇకపై దక్కబోవని బెదిరించడం వంటి నీచరాజకీయాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఇక ప్రతీ చిన్నా పెద్దా ఎన్నికలలో పార్టీలలోని అతిరధమహారధులను ఆయా జిల్లాలు లేదా నియోజకవర్గాలలో మోహరించడం, ఎన్నికల ప్రచారసభలకు హాజరయ్యే అగ్రనేతలు కత్తులు, బాణాలు ప్రదర్శించడం, శంఖారావాలు చేయడం వంటివన్నీ చూస్తుంటే జరుగుతున్నవి ప్రజాప్రతినిధిని ఎన్నుకొనేందుకు జరుగుతున్న ఎన్నికలా లేక కురుక్షేత్ర మహాసంగ్రామమా? అన్నట్లుంటుంది.

అసలు ప్రతీ ఎన్నికలను రాజకీయ పార్టీలు...ముఖ్యంగా అధికార పార్టీలు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవలసిన అవసరం ఏమిటి?సార్వత్రిక ఎన్నికలలో అధికారం దక్కించుకోవాలని పార్టీలు వాటి నాయకులు పోటీలు పడటం సహజమే కానీ ప్రభుత్వానికి, పార్టీకి ఏమాత్రం లాభం లేదా నష్టం కలిగించని ఉపఎన్నికలను కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవలసిన అవసరం ఏమిటి?ఒక సీటు కోల్పోతే ప్రభుత్వం కూలిపోతుందంటే అర్ధం చేసుకోవచ్చు. ఆ ఒక్కసీటుతో పార్టీ భవిష్యత్‌ మారిపోతుందన్నా అర్ధం చేసుకోవచ్చు. కానీ ఓడినా గెలిచినా పెద్దగా ప్రభావం చూపని ఉపఎన్నికల కోసం కూడా అధికార, ప్రతిపక్షాలు కురుక్షేత్ర మహాసంగ్రామంలా భావించి యుద్ధసన్నాహాలు చేసుకోవలసిన అవసరం ఏమిటి?

ప్రజలు ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకొనేందుకే ఎన్నికలు జరుగుతాయి. కానీ ఉపఎన్నికలను అడ్డుపెట్టుకొని ఒక పార్టీ మరో పార్టీని లేదా ప్రభుత్వాన్ని లేదా ప్రతిపక్షాన్ని రాజకీయంగా దెబ్బ తీసేందుకు పోరాడుకోవడం దేనికి?ఈవిదంగా చేస్తూపోతే చివరికి నష్టపోయేది రాజకీయ పార్టీలు... నేతలే కదా?

రాజకీయాలలో ప్రజాస్వామ్య విధానాలు,  నైతిక విలువలే వారిని...వారి పార్టీలను కాపాడుతాయనే గ్రహించకుండా అందరూ ఒక్కో మెట్టు దిగుతూ రాజకీయాలను ఓ బురదగుంటగా మార్చేసి దానిలో వారే కూరుకుపోతున్నారు. ఈవిదంగా ఒకరినొకరు దెబ్బ తీసుకోవడం వలన చివరికి ఏమి జరుగుతుందో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలను, నేతల పరిస్థితిని చూస్తే కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.

అయితే ఎదుటవాడు తమని దెబ్బ తీస్తాడనే భయంతో ఎవరూ వెనక్కు తగ్గలేని పరిస్థితి నెలకొంది. కనుక భవిష్యత్‌లో జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాలు మరింత అధ్వానంగా మారడం ఖాయం. వాటికి పార్టీలు, నేతలు చివరికి సామాన్య ప్రజలు కూడా మూల్యం చెల్లించక తప్పదని మరిచిపోకూడదు. 


Related Post