తెలంగాణలో అమెరికన్ కంపెనీ భారీ పెట్టుబడి

June 25, 2021


img

అమెరికాలోని విలాసవంతమైన కార్లు, ఖరీదైన బైకులు తయారు చేస్తున్న ట్రైటాన్-ఈవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ.2,100 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ట్రైటాన్ కంపెనీ గురువారం ఒప్పందం కుదుర్చుకొంది. ఆ కంపెనీ సీఈఓ హిమాన్షు పటేల్ నిన్న రాష్ట్ర పరిశ్రమలశాఖా మంత్రి కేటీఆర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ తమ కంపెనీ ప్రణాళికను వివరించారు.  

ట్రైటాన్ కంపెనీ ప్రధానంగా విద్యుత్‌తో నడిచే వాహనాలను తయారు చేస్తుంటుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండటం, ప్రపంచవ్యాప్తంగా వాయుకాలుష్యం పెరిగిపోతుండటం వలన భవిష్యత్‌లో విద్యుత్ వాహనాలకే ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుందని అన్నారు. 

భారత్‌లోని వివిద రాష్ట్రాలలో వ్యాపార అవకాశాలు, పారిశ్రామిక పాలసీలను, పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలను నిశితంగా పరిశీలించిన తరువాత తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలంగా ఉందని భావించి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. 

రూ.2,100 కోట్లు పెట్టుబడితో జహీరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న తమ ప్లాంటులో ప్రత్యక్షంగా సుమారు 25,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. జహీరాబాద్ ప్లాంటులో మొదటి ఐదేళ్ళలో 50,000 సెడాన్లు, లగ్జరీ కార్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని చెప్పారు. ఆ తరువాత సరుకు రవాణా, మిలటరీకి అవసరమైన వాహనాలను కూడా తయారు చేయాలనుకొంటున్నట్లు హిమాన్షు పటేల్ చెప్పారు.  

ఈ ఏడాది మార్చిలో తమ కంపెనీ తయారుచేసిన హెచ్-లగ్జరీ ఎస్‌యువీని విడుదల చేశామని, ఈ ఏడాది అక్టోబరులోగా ఎన్‌-4 మోడల్ కారును కూడా విడుదల చేయనున్నట్లు చెప్పారు. గత కొంతకాలంగా మహారాష్ట్రలోని పూణేలో ఓ తాత్కాలిక యూనిట్‌ను ఏర్పాటుచేసుకొని దానిలో హెచ్-లగ్జరీ కార్లను అసంబెల్ చేస్తున్నామని, వాటికి భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు జహీరాబాద్‌లో శాశ్విత ప్లాంటును ఏర్పాటుచేయబోతున్నామని తెలిపారు.


Related Post