మళ్ళీ రాష్ట్రంగా మారబోతున్న జమ్ముకశ్మీర్‌

June 24, 2021


img


ప్రధాని నరేంద్రమోడీ గురువారం జమ్ముకశ్మీర్‌కు చెందిన వివిద పార్టీల నేతలతో ఢిల్లీలో సమావేశ్మయ్యారు. సుమారు 3 గంటలపాటు సాగిన ఈ సమావేశంలో రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజింపబడిన జమ్ముకశ్మీర్‌ను మళ్ళీ ఒకే రాష్ట్రంగా మార్చాలనే ప్రతిపక్ష నేతల డిమాండ్‌పై ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్‌ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ తెలిపారు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నప్పుడే, పరిస్థితులు చక్కబడిన తరువాత మళ్ళీ ఒకే రాష్ట్రంగా మార్చుతానని తాను హామీ ఇచ్చానని, ఆ మాటకు కట్టుబడి ఉంటానని ప్రధాని నరేంద్రమోడీ అన్నట్లు ప్రతిపక్ష నేతలు చెప్పారు. 

ఈ సమావేశంలో ప్రధానంగా 5 అంశాలపై చర్చించినట్లు వారు తెలిపారు. 

1. జమ్ముకశ్మీర్‌కు మళ్ళీ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వడం. 

2. వీలైనంత త్వరగా శాసనసభ ఎన్నికలు నిర్వహించి మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్దరించడం. 

3. కశ్మీరీ పండిట్లకు జమ్మూలో పునరావాసం కల్పించడం. 

4. రాజకీయ ఖైదీలను విడుదల చేయడం. 

5. స్థానికులకు భూమిపై హామీ ఇవ్వడం.     

ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో సహా వివిద పార్టీలకు చెందిన మొత్తం 14 మంది నేతలు హాజరయ్యారు. వారిలో కొంతకాలం గృహనిర్బందంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు కూడా ఉన్నారు. ఈ సమావేశం చాలా సహృధ్భావ వాతావరణంలో జరిగిందని బిజెపి సీనియర్ నేత రాం మాధవ్ ట్వీట్ చేశారు. అయితే ఈ సమావేశంలో ఎవరూ కశ్మీర్‌కు మళ్ళీ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని కోరినట్లు లేదు. త్వరలో జరుగబోయే వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో జమ్ముకశ్మీర్‌కు మళ్ళీ రాష్ట్ర హోదా కల్పిస్తూ బిల్లును ఆమోదించిన తరువాత మళ్ళీ రాష్ట్రంగా ఏర్పడుతుంది. ఆ తరువాత రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన చేసిన తరువాత శాసనసభ ఎన్నికలు నిర్వహించగలుగుతారు. బహుశః ఈ ఏడాది డిసెంబర్‌లోగా జమ్ముకశ్మీర్‌ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 



Related Post