ఇంత గర్జించి గెలిస్తే పర్వాలేదు కానీ ఓడితే...

June 23, 2021


img

ఈటల రాజేందర్‌ మంత్రి పదవిలో ఉన్నప్పుడు, తొలగించిన తరువాత కూడా చాలా సంయమనంతో మాట్లాడేవారు. కానీ బిజెపిలో చేరినప్పటి నుంచి కాస్త గట్టిగానే మాట్లాడుతున్నారు. అది బిజెపి దన్ను ఉందనే ధైర్యంతోనా లేదా హుజూరాబాద్‌లో తనకు తిరుగులేదనే నమ్మకంతోనా అనేది తెలియదు కానీ ఇప్పుడు సిఎం కేసీఆర్‌ను ఉద్దేశ్యించి నేరుగా విమర్శలు చేస్తుండటమే కాక ‘మా వాళ్ళ జోలికి రాకు బిడ్డా...‘ అంటూ సిఎం కేసీఆర్‌ స్టైల్లోనే హెచ్చరిస్తున్నారు. 

సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ నేతల దూకుడు గురించి అందరికీ తెలుసు కనుక హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో గెలవాలంటే తాను కూడా అంతే దూకుడుగా వ్యవహరించాలనే ఉద్దేశ్యంతో ఈటల రాజేందర్‌ ఈవిదంగా మాట్లాడుతున్నారేమో? లేకుంటే తన అనుచరులలో అపనమ్మకం ఏర్పడితే అందరూ చేజారి ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంతగా గర్జిస్తున్న ఈటల రాజేందర్‌ అసలు హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో పోటీ చేస్తారా లేదా?తన భార్య జమున లేదా బిజెపి అభ్యర్ధిని నిలబెట్టి వారికి మద్దతుగా ప్రచారానికే పరిమితమవుతారా?అనే సందేహాలు అప్పుడే వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఆయనే పోటీ చేసి గెలిచినా లేదా బిజెపి అభ్యర్ధిని గెలిపించుకోగలిగినా పరువు నిలుస్తుంది కానీ ఓడిపోతే మాత్రం నవ్వులపాలవుతారు...రాజకీయంగా బలహీనపడతారు. 

ఒకప్పుడు రాష్ట్రస్థాయి రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్‌, ఇప్పుడు హుజూరాబాద్‌కే పరిమితం కావడం తాజా రాజకీయ పరిణామం అనుకొంటే, ‘హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో సిఎం కేసీఆర్‌ డబ్బులు కుమ్మరించి టిఆర్ఎస్‌ అభ్యర్ధిని గెలిపించుకొనే ప్రయత్నాలు చేస్తారని,’ ఈటల రాజేందర్‌ పదేపదే ఆరోపిస్తుండటం గమనిస్తే ఉపఎన్నికల గంట ఇంకా మ్రోగకమునుపే ఈటల తన ఓటమికి మానసికంగా సిద్దపడుతూ దానికి ఇప్పటి నుంచే బలమైన కారణాలు సిద్దం చేసుకొంటున్నట్లు కనిపిస్తోంది. 


Related Post