వాసాలమర్రిలో సిఎం కేసీఆర్‌ స్పూర్తిదాయకమైన ప్రసంగం

June 22, 2021


img

సిఎం కేసీఆర్‌ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో కలిసి సహ పంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను ఉద్దేశ్యించి చాలా స్పూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ఆయన వాసాలమర్రి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడిన మాటలు నిజానికి రాష్ట్రంలో అన్ని జిల్లాలలోని పట్టణాలు, గ్రామాల ప్రజలకు కూడా చాలా స్పూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పవచ్చు. 

వాసాలమర్రి గ్రామంలో ప్రతీ ఒక్కరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని అలాగే గ్రామంలో ప్రజలందరూ ఒకే కుటుంబంలో సభ్యులు అన్నట్లు కలిసిమెలిసి ఉంటూ ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకోవాలని అన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామాభివృద్ధి చేసుకొందామని సూచించారు. 

నిజామాబాద్‌ జిల్లాలో అంకాపూర్ గ్రామాన్ని అక్కడి ప్రజలు పట్టుబట్టి ఏవిధంగా అభివృద్ధి చేసుకొన్నారో అదేవిధంగా వాసాలమర్రి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో గ్రామానికి చెందిన 270 మందిని అక్కడికి పంపించామని అన్నారు. అదే స్పూర్తితో వాసాలమర్రి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకొందామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. గ్రామాభివృద్ధికి కమిటీలు వేసుకొని పని చేయాలని, గ్రామాభివృద్ధికి ప్రభుత్వం దాని వెనుక తాను అన్నివిధాలా సహకరిస్తామని చెప్పారు. అవసరమైతే గ్రామానికి మరో 20 సార్లు వస్తానని చెప్పారు. 

సిఎం కేసీఆర్‌ స్పూర్తిదాయకమైన ప్రసంగం గురించి మాటలలో చెప్పడంకంటే ఆయన ఏమి చెప్పారో వింటే బాగుంటుంది. ఈనాడు మీడియా సౌజన్యంతో మై.తెలంగాణ.కాం ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేసిన సిఎం కేసీఆర్‌ వీడియో ప్రసంగాన్ని వినట్లయితే అది ఎంత స్పూర్తిదాయకంగా ఉందో అర్ధం అవుతుంది. రాష్ట్రంలో ప్రతీ పట్టణం, గ్రామంలోని ప్రజలు తప్పక విని తీరాల్సిన ప్రసంగం ఇది.



Related Post