థర్డ్ ఫ్రంట్‌పై నమ్మకం లేదంటూనే ప్రయత్నాలు!

June 22, 2021


img

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఓ వైపు బిజెపియేతర పార్టీల అధినేతలతో వరుసగా భేటీ అవుతూనే, థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్‌లతో తనకు ఎటువంటి సంబందాలు లేవని, అసలు దానిపై తనకు నమ్మకం లేదని, థర్డ్ ఫ్రంట్ బిజెపిని ఓడించలేదని చెపుతుండటం విశేషం.

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో బిజెపిని ఓడించి మళ్ళీ మమతా బెనర్జీకి అధికారం దక్కేలాచేసేందుకు తెర వెనుక గట్టిగా కృషి చేసిన ప్రశాంత్ కిషోర్‌, ఆ తరువాత నుంచే మెల్లగా ఉత్తరాది రాష్ట్రాలలోని బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీల అధినేతలతో భేటీ కాసాగారు. పది రోజుల వ్యవధిలో ఎన్సీపీ(మహారాష్ట్ర) అధినేత శరద్ పవార్‌తో రెండుసార్లు ప్రశాంత్ కిషోర్‌ భేటీ అయ్యారు. ఇవాళ్ళ ఢిల్లీలో పవార్ నివాసంలో 15 రాజకీయపార్టీల నేతలు సమావేశం అవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించి నరేంద్రమోడీని గద్దె దించడమే లక్ష్యంగా వారు పావులు కదుపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో చర్చించాల్సిన అంశాలు, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాల గురించి మాత్రమే చర్చిస్తున్నారని ఆయా పార్టీల ప్రతినిధులు చెప్తున్నారు.

వారి ఈ సమావేశం వెనుక ప్రశాంత్ కిషోర్‌ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ వాటిని ఆయన ఖండిస్తున్నారు. తనకు ఆ పార్టీలు, నేతలు, వారి భేటీలతో ఎటువంటి సంబందమూ లేదని, అయినా థర్డ్ ఫ్రంట్ బిజెపిని ఓడించలేదని చెపుతున్నారు. ఆయనకు అటువంటి ఆలోచనలు, నమ్మకం లేనట్లయితే శరద్ పవార్ వంటి నాయకులను ఎందుకు కలుస్తున్నారు? అసలు ఆ అవసరం ఏమిటి?ప్రశ్నిస్తే జవాబు లభిస్తుంది.

కానీ ప్రశాంత్ కిషోర్‌ చెపుతున్నట్లు థర్డ్ ఫ్రంట్ ఎన్నటికీ బిజెపిని ఓడించలేదు. ఎందుకంటే కేంద్రంలో పదవులు, అధికారం కోసం ఆరాటపడుతున్న రాజకీయనాయకులతో కూడిన అది ఓ కప్పల తక్కెడ వంటిది. దానిలో ఎంత వరకు ఎవరు ఉంటారో ఎవరు బయటకు దూకేస్తారో తెలీదు. అటువంటి నేతలతో కూడిన థర్డ్ ఫ్రంట్ పటిష్టమైన, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని ఢీకొని ఓడించడం అసాధ్యం. కనుక ప్రశాంత్ కిషోర్‌ ఎప్పటిలాగే ఏదో ఓ రాష్ట్రానికి లేదా పార్టీకి పనిచేసుకొంటే మంచిదేమో?


Related Post