కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హడావుడిగా ఢిల్లీకి పరుగు!

June 21, 2021


img

తెలంగాణ పిసిసికి కొత్త అధ్యక్షుడి నియామకం డైలీ సీరియల్లాగా నెలల తరబడి కొనసాగుతుంటే, దాని గురించి మీడియాలో ‘ఇదిగో పులి..అంటే అదిగో తోక...’ అన్నట్లు రోజూ కొత్తకొత్త ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయిన తరువాత హడావుడిగా ఢిల్లీ బయలుదేరి వెళ్ళడంతో అక్కడ ఏదో జరిగిపోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌ రెడ్డికే రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు కట్టబెట్టాలనుకొంటోందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెవిలో ఊదడంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఢిల్లీ బయలుదేరి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఢిల్లీలో నాలుగు రోజులు మకాం వేసి హైదరాబాద్‌ తిరిగివచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతోనే హడావుడిగా బయలుదేరివెళ్ళారని, ఆయనకే పిసిసి అధ్యక్ష పదవి ఖాయం అయ్యుండవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇంకా ఎన్ని రోజులు సాగదీస్తారో తెలీదు కానీ ఇలాగే కొనసాగితే పార్టీలో సీనియర్లు సైతం సహనం కోల్పోవడం తధ్యం.


Related Post