తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు...తెలంగాణకు ప్రత్యేకాభినందనలు: జస్టిస్ ఎన్వీ రమణ

June 21, 2021


img

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు రెండు తెలుగు రాష్ట్రాలలో తమ పర్యటన ముగించుకొని నిన్న ఢిల్లీ తిరుగుప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకొంటూ ‘తెలుగు ప్రజలకు వందనం..తీర్చలేనిది ఈ రుణం’ అనే శీర్షికతో ఓ బహిరంగ లేఖ మీడియాకు విడుదల చేశారు. దానిలో ఆయన ఏమి వ్రాశారంటే, “నన్నుగన్న తల్లిదండ్రుల వోలె, నన్ను పసిబిడ్డ మాదిరి అక్కునజేర్చుకుని అపార ప్రేమాభిమానాలతో, ఆశీర్వచనాలతో ముంచెత్తిన నిష్కల్మష, ప్రగతిశీల తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు. నా జీవితంలో భావోద్వేగానికి గురైన సందర్భాలలో ఈ పర్యటన ఒకటి,” అంటూ తమ మనసులో భావాలను తెలియజేశారు. 


తమ జీవితంలో మరపురాని పర్యటనగా మలిచినందుకు, తమను ఎంతో ప్రేమాభిమానాలతో ఆదరించినందుకు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సిఎం కేసీఆర్‌, పోలీస్, వివిద శాఖల ఉన్నతాధికారులు, యాదాద్రి ఆలయ అధికారులు, సిబ్బందికి జస్టిస్ ఎన్వీ రమణ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. యాదాద్రి ఆలయాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు సిఎం కేసీఆర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మళ్ళీ వచ్చే నెల 23 నుంచి మొదలయ్యే బోనాల పండుగకు రావాలని తమను ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ సభ్యులను కృతజ్ఞతలు తెలుపుకొని తప్పకుండా వస్తామని మాటిచ్చారు. కరోనా పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జస్టిస్ ఎన్వీ రమణ విజ్ఞప్తి చేశారు.


Related Post