తెలంగాణ ఏర్పడక మునుపే అన్ని ఆలోచించాం: కేసీఆర్‌

June 21, 2021


img

సిఎం కేసీఆర్‌ ఆదివారం సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాలో పర్యటించి, అక్కడ కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, పోలీస్ కమీషనరేట్ కార్యాలయాలను ప్రారంభోత్సవం చేశారు.  

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మునుపు ప్రజలు పడిన కష్టాలు, ఏర్పడిన తరువాత వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. 

మిషన్ కాకతీయ: “తెలంగాణ ఏర్పడక మునుపే నేను, స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్, స్వర్గీయ విద్యాసాగర్ కలిసి రాష్ట్రంలో చిన్నా భిన్నమైయున్న త్రాగు,సాగు నీటి వసతులను ఏవిదంగా పునరుద్దరించాలని రాత్రి పొద్దుపోయేవరకు చర్చించుకొనేవారం. ఆనాడు కాకతీయ రాజులు ఎంతో దూరదృష్టితో నిర్మించిన గొలుసుకట్టు చెరువులను బాగుచేసుకొని వినియోగంలోకి తెచ్చుకోవాలని ఆనాడే నిర్ణయించుకొన్నాము. మన రాష్ట్రానికి కాకతీయరాజులు చేసిన ఆ మహోపకారానికి కృతజ్ఞతగా వారి పేరిటే మిషన్ కాకతీయను ఏర్పాటు చేయాలని ఆనాడే నిర్ణయించాము. ఈసంగతి చాలామందికి తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు.” ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ తెలంగాణ ఏర్పడక మునుపు రైతులు ఎన్ని కష్టాలు పడ్డారో వివరించారు. 

సంక్షేమ పధకాలు: తెలంగాణ ఏర్పడక మునుపు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించినప్పుడు రైతులు, పేద ప్రజలు పడుతున్న కష్టాలను చూసి ఎంతో ఆవేదన చెందానని, వారి కష్టాలు తీర్చేందుకే రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కిలో రూ.2 బియ్యం, పింఛన్లు వగైరా పధకాలన్నీ ప్రవేశపెట్టి అమలుచేస్తున్నామని వాటి కోసం ఎంతో మేధోమధనం చేశామని సిఎం కేసీఆర్‌ అన్నారు. నేను ఉన్నంత కాలం ఈ పధకాలన్నీ కొనసాగుతూనే ఉంటాయి. నా తరువాత కూడా నిరంతరం కొనసాగేవిదంగా అవసరమైన ఏర్పాట్లు చేశామని సిఎం కేసీఆర్‌ చెప్పారు.  

కరెంటు కష్టాలు: రాష్ట్రం ఏర్పడక మునుపు కరెంటు కష్టాలు ఎప్పటికైనా తీరుతాయా? అనే సందేహపడేవాడినని కానీ కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని ఆరు నెలల్లోనే కరెంటు కష్టాలు తీర్చడంతో రుజువు అయ్యిందన్నారు. కరెంటు కష్టాలు తీర్చడమే కాక రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సిఎం కేసీఆర్‌ చెప్పారు.


Related Post