సాగర్ ఫార్ములా ఎందుకు?

June 19, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఆరు నెలల్లోగా హుజూరాబాద్‌ ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి కూడా నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో ఫార్ములానే టిఆర్ఎస్‌ అమలుచేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంటే ఇంతవరకు ఎన్నికలలో పోటీ చేయని వ్యక్తిని అభ్యర్ధిగా నిలబెట్టబోతున్నట్లు భావించవలసి ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరనే విషయం పక్కనబెడితే ఈ ఉపఎన్నికలలో కూడా టిఆర్ఎస్‌ సాగర్ ఫార్ములా అమలుచేసేందుకు కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 

• టిఆర్ఎస్‌ ప్రతిష్టకు...ముఖ్యంగా సిఎం కేసీఆర్‌ ప్రతిష్టకు భంగం కలిగేవిదంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న ఈటల రాజేందర్‌ స్థాయిని తగ్గించి రాజకీయంగా ప్రతీకారం తీర్చుకొనేందుకు ఈ వ్యూహం అమలుచేయవచ్చు. 

• ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి అవమానకరంగా బయటకు పంపించడంతో ప్రజలలో ఆయన పట్ల సానుభూతి నెలకొని ఉంది. కనుక ఈటల తొలగింపు విషయంలో టిఆర్ఎస్‌ అధిష్టానం నిర్ణయం సరైనదే అని నిరూపించుకోవడం కోసం ఇది పనికి వస్తుంది. 

• అన్నిటి కంటే ముఖ్యంగా, తాను టిఆర్ఎస్‌ వల్లో సిఎం కేసీఆర్‌ దయవల్లో కాక ప్రజాదారణ, వారి ఆశీర్వాదాలు ఉన్నాయి గనుకనే ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంపికయ్యానని ఈటల రాజేందర్‌కు పదేపదే చెప్పుకొంటున్న సంగతి తెలిసిందే. కానీ టిఆర్ఎస్‌, గులాబీ జెండాల అండదండలు, సిఎం కేసీఆర్‌ల ఆశీర్వాదం లేకపోతే ప్రజలు ఈటలను కూడా పట్టించుకోరని, సిఎం కేసీఆర్‌ ఎవరిని నిలబెడితే వారినే ప్రజలు గెలిపిస్తారని నిరూపించేందుకు ఈ వ్యూహం పనికి వస్తుంది. కానీ టిఆర్ఎస్‌ ఎవరిని అభ్యర్ధిగా ప్రకటిస్తుందో తెలియాలంటే ఉపఎన్నికల గంట మ్రోగేవరకు వేచి చూడాల్సిందే.


Related Post