కోదండరాం కలను ఏపీ ప్రభుత్వం నెరవేర్చింది!

June 19, 2021


img

టిజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఏపీ ప్రభుత్వం దానిని నెరవేర్చింది. ఏపీలో ప్రభుత్వోగ్యాల నోటిఫికేషన్‌లకు సంబందించి జాబ్ క్యాలండర్‌ను సిఎం జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అమరావతిలో విడుదల చేశారు. 2021 జూలై నుంచి 2022 మార్చి వరకు రాబోయే తొమ్మిది నెలల్లో ఎప్పుడెప్పుడు ఏఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతాయో దానిలో తెలియజేసింది. ఈ సందర్భంగా ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం సారాంశం క్లుప్తంగా... 

• గత రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలు కల్పించాం. 

• 51,387 మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాం. వారి పదవీ విరమణ వయసును 60 సం.లకు పెంచాం.   

• ఈ జాబ్ క్యాలండర్‌లో పేర్కొన్నదాని ప్రకారం రాబోయే 9 నెలల్లో వివిద శాఖలలో మొత్తం 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తాం.

•   గత ప్రభుత్వ హయాంలో భర్తీ చేయకుండా వదిలేసిన బ్యాక్ లాగ్ పోస్టులను కూడా ఈ జాబ్ క్యాలండర్‌లో భర్తీ చేయబోతున్నాం. 

• రాబోయే తొమ్మిది నెలల్లో ఎప్పుడెప్పుడు ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతాయో జాబ్ క్యాలండర్‌లో ముందే ప్రకటించినందున నిరుద్యోగులు నెలలు, ఏళ్ళ తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడనవసరం లేదు. కోచింగ్ కోసం నెలల తరబడి పట్టణాలలో అద్దెకుంటూ డబ్బు వృధా చేసుకోనక్కరలేదు.     

• అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శకంగా ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేసేందుకుగాను ఇంటర్వ్యూల విధానానికి స్వస్తి పలికాం. ఇకపై రాత పరీక్షలో ప్రతిభ కనబరిచినవారికే ఉద్యోగాలు దక్కుతాయి.

• వివిద ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో పూర్తి జీతాలు చెల్లించడంలేదని గుర్తించగానే వారి కోసమే ప్రత్యేకంగా ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్ సర్వీసస్ (ఆప్కాస్) అనే వ్యవస్థను ఏర్పాటు చేసి ద్వాని ద్వారానే వారి భర్తీ చేస్తూ, ప్రతీ నెల 1వ తేదీన వారికి పూర్తి జీతాలు అందజేస్తున్నాం. ఇప్పటివరకు ఆప్కాస్ ద్వారా మొత్తం 95,000 మందికి ఉద్యోగాలు కల్పించాం.


Related Post