ప్రజలకు సిఎం కేసీఆర్‌కు మద్య ఇనుపగోడలు?

June 18, 2021


img

ఒకప్పుడు ఉద్యమ సమయంలో టిఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిత్యం ప్రజల మద్యనే ఉండేవారు. రాష్ట్రంలో అన్ని కులమతాల ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్ధులు, అన్ని పార్టీల నాయకుల మద్యలో కేసీఆర్‌ కనిపిస్తుండేవారు. నిత్యం అందరితో మమేకం అవుతూ అందరినీ ఒకేబాటలో నడిపిస్తూ ఉద్యమాలు చేసి చివరికి తెలంగాణ రాష్ట్రం సాధించారు. ఇది అందరికీ తెలిసిన చరిత్ర. 

కానీ తెలంగాణ ఏర్పడి, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన క్రమంగా ప్రజలకు, ప్రతిపక్షాలకు దూరం కాసాగారు. ఉద్యమ సమయంలో ప్రజల మద్య ఉండటం సహజమే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజల మద్య ఉండాలనుకోవడం అత్యాశే కాక అసంభవం కూడా. కనుక అందుకు ఆయనను తప్పు పట్టడానికి లేదు. కానీ కంచుకోట వంటి ప్రగతి భవన్‌లోకి మారిన తరువాత ప్రజలు, ప్రతిపక్షాలే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా      లోపలకు ప్రవేశం లభించడం చాలా కష్టమయ్యిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దీనిలో నిజానిజాలు టిఆర్ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులకే తెలియాలి. 

ప్రగతి భవన్‌ ప్రవేశద్వారం వద్ద భారీ ఇనుప గేట్ ఉంది. ప్రగతి భవన్‌ చుట్టూ వందల మంది పోలీసులతో మూడంచెల పటిష్టమైన పోలీసు భద్రత ఉంది. ఇటీవల తరచూ ప్రగతి భవన్‌ ఎదుట నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్దులు ఎవరో ఒకరు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఒక్కోసారి ఆందోళనకారులు వారి కళ్ళు గప్పి లోపలకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు చాలానే జరిగాయి. కనుక ప్రగతి భవన్‌ వద్ద మరింత పటిష్టమైన భద్రత ఏర్పాటు కోసం కొత్తగా పంజాగుట్ట-బేగంపేట మద్యలో డివైడర్‌ స్థానంలో ఓ గోడ నిర్మించి దానిపై పెద్ద ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అవి పూర్తయితే ఇక ఎవరూ వాటిని దాటి ప్రగతి భవన్‌ వైపు ప్రవేశించలేరు. అంటే ప్రజలకు, సిఎం కేసీఆర్‌కు మద్య మరో ఇనుపగోడ ఏర్పాటవుతోందనుకోవాలేమో?


Related Post