హుజూరాబాద్‌లో పోటీ చేయాలనుకొంటున్నాను: పెద్దిరెడ్డి

June 17, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బిజెపిలో చేర్చుకొంటున్నట్లు తెలియగానే ముందుగా వ్యతిరేకించిన వ్యక్తి పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి. ఆయన బహిరంగంగానే తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ బిజెపి అధిష్టానం ఈటలకు కాషాయకండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించింది. ఆయనే హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు కనుక ఉపఎన్నికలలో ఆయనే పోటీ చేయబోతున్నారన్నట్లే మాట్లాడుతున్నారు. బిజెపి కూడా ఆయన మాటలను ఖండించలేదు. కనుక ఉపఎన్నికలలో ఈటల పోటీ చేయడం దాదాపు ఖరారు అయినట్లే. టిఆర్ఎస్‌ కూడా ఆయనే పోటీ చేస్తారనే భావిస్తున్న అందుకు తగ్గట్లుగానే వ్యూహాలు, సమర సన్నాహాలు చేసుకొంటుండటం అందరూ చూస్తున్నారు. 

ఇటువంటి పరిస్థితులలో ఈటల రాకను తీవ్రంగా వ్యతిరేకించిన పెద్దిరెడ్డి పార్టీ మారే ఆలోచనలు చేస్తారనుకొంటే ఒక సరికొత్త ప్రతిపాదనను బిజెపి ముందుంచారు. తనకు అవకాశం ఇస్తే హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో పోటీ చేస్తానని అన్నారు. తద్వారా ఆయన బిజెపికి పరీక్ష పెడుతున్నారా లేక తనను అస్త్రంగా ఉపయోగించుకొని ఈటల రాజేందర్‌పై ప్రయోగించుకోమని టిఆర్ఎస్‌కు పరోక్షంగా సంకేతాలు పంపిస్తున్నారా?అనే సందేహం కలుగకమానదు. 

అయితే పెద్దిరెడ్డి ఏ ఉద్దేశ్యంతో ఈ ప్రతిపాదన చేసినప్పటికీ ఈటలకు, బిజెపికి ఇది ఒక మంచి అవకాశమనే చెప్పవచ్చు. ఎందుకంటే ఉపఎన్నికల కోసం టిఆర్ఎస్‌ అప్పుడే ఏ స్థాయిలో సమర సన్నాహాలు చేస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్‌ చేతిలో ఓడితే ఈటల రాజేందర్‌కు, బిజెపికి కూడా తీరని అప్రదిష్టే. పైగా ఈ ఉపఎన్నికలు ఈటల రాజకీయ అనుభవానికి, ప్రతిష్టకు పరీక్షగా నిలువనున్నాయి కనుక ఆయన పెద్దిరెడ్డిని గెలిపించుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడితే  ఈ ఉపఎన్నికలలో ఓడినా గెలిచినా వారిరువురి మద్య సయోధ్య ఏర్పడుతుంది. పెద్దిరెడ్డి వంటి సీనియర్ నేతను టిఆర్ఎస్‌కు కోల్పోకుండా కాపాడుకోవచ్చు కూడా. కనుక పెద్దిరెడ్డి ప్రతిపాదనపై బిజెపి పెద్దలు సానుకూలంగా ఆలోచిస్తే మంచిదేమో? 


Related Post