కాంగ్రెస్‌ ఖాతాలో మరో ఓటమి ముందే ఫిక్స్?

June 17, 2021


img

నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో కె.జానారెడ్డి వంటి సీనియర్ నేతను...ఆయన ప్రతిష్టను పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ తన పూర్తి సర్వశక్తులను ఒడ్డి పోరాడినా టిఆర్ఎస్‌ చేతిలో ఓటమి తప్పలేదు. మరి హుజూరాబాద్‌లో ఏమవుతుంది?అంటే సమాధానం అందరికీ తెలుసు. 

నిజానికి ఈటల రాజేందర్‌ టిఆర్ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరినప్పుడే కాంగ్రెస్‌ విధి కూడా ఖరారైపోయిందని చెప్పవచ్చు. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండి ఉంటే హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో ఏమాత్రమైన గెలిచే అవకాశం ఉండేదేమో కానీ బిజెపిలో చేరడంతో ఎప్పటిలాగే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మూడో స్థానానికి పరిమితం కాక తప్పదు. ఎందుకంటే ఈ ఉపఎన్నికలు కూడా టిఆర్ఎస్‌, బిజెపిల మద్య ఇంకా చెప్పాలంటే సిఎం కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ల మద్య జరుగబోతున్నాయి. 

బహుశః ఈవిషయం కాంగ్రెస్‌ నేతలు కూడా గ్రహించే ఉంటారు అందుకే పార్టీలో ఎవరూ ఉపఎన్నికల ఊసే ఎత్తడం లేదు. ఈటల, టిఆర్ఎస్‌ నేతలు అప్పుడే ఉపఎన్నికలకు సైన్యాలను, అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకొంటుంటే  కాంగ్రెస్‌ నేతలు మాత్రం అదేమీ పట్టనట్లు పిసిసి అధ్యక్ష పదవి గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదుగుతుంటే, టిఆర్ఎస్‌, బిజెపిల పద్మవ్యూహంలో నుంచి బయటపడి తమ పార్టీని కాపాడుకోవడానికి కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కనబడటం లేదు. కాంగ్రెస్‌ నేతలు ఇదే విదంగా కాలక్షేపం చేస్తే చివరికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అదృశ్యమైనా ఆశ్చర్యం లేదు. 


Related Post