ట్విట్టర్‌పై ప్రతీకార చర్యలు ఎవరికి నష్టం?

June 17, 2021


img

మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్‌కు కేంద్రప్రభుత్వంతో సహా అప్పుడే కొన్ని రాష్ట్రాలు కూడా వరుసగా షాకులు ఇస్తున్నాయి. ట్విట్టర్‌ సంస్థలో ఫిర్యాదుల పరిష్కారానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే విషయంలో కేంద్రప్రభుత్వంతో విభేదించి ఆ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో సమస్య పెద్దదైంది. ఆ తరువాత ట్విట్టర్‌ వెనక్కు తగ్గి చట్ట ప్రకారం నడుచుకొనేందుకు అంగీకరించినప్పటికీ, కేంద్రప్రభుత్వం ట్విట్టర్‌కన్న రక్షణ కావాచాన్ని తొలగించి పెద్ద షాక్ ఇచ్చింది.

ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియాలో వివిద వ్యక్తులు, సంస్థలు పోస్ట్ చేసేవాటిలో తప్పుడు సమాచారం ఉంటే వాటిపై ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లపై పోలీస్ కేసులు, కోర్టు కేసులు పెట్టకుండా ఐ‌టి యాక్ట్ లోని సెక్షన్ 79 ప్రకారం ప్రత్యేక రక్షణ పొందుతుండేవి. కేంద్రప్రభుత్వం దానినే ట్విట్టర్‌కు తొలగించడంతో సమస్యలు ఎదుర్కొంటోందిప్పుడు. ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడుతున్న సందేశాలు, వీడియోలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దేశంలో పలు ప్రాంతాలలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నటి మీరాచోప్రాకు చెందిన ఓ నకిలీ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ కాగా దానిపై ఆమె ట్విట్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదంటూ హైదరాబాద్‌లో ఓ కేసు నమోదైంది. ఈ కేసులో హైదరాబాద్‌ పోలీసులు ట్విట్టర్‌ సంస్థకు సంజాయిషీ కోరుతూ నోటీస్‌ పంపించారు. 

ఎంత గొప్ప సంస్థ అయినా అది పని చేస్తున్న దేశంలోని చట్టాలకు లోబడి పని చేయాల్సి ఉంటుందని వేరే చెప్పక్కరలేదు. ట్విట్టర్‌ మొదట వ్యతిరేకించినా తరువాత భారత్‌ చట్టాలకు లోబడి నడుచుకొంటామని తెలియజేసింది. కనుక ట్విట్టర్‌పై ప్రతీకారచర్యలు సమర్ధనీయం కాదు. ఒకవేళ ట్విట్టర్‌ లేదా మరో సంస్థ చట్ట వ్యతిరేకంగా సాగుతుంటే వాటిని న్యాయస్థానాలే సరిచేస్తాయి. మన న్యాయ వ్యవస్థలు ఉన్నది అందుకే. 

భారత్‌కు అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడులు రావాలని కోరుకొంటున్నప్పుడు, వచ్చినవాటిని ఈవిదంగా ఇబ్బంది పెడితే అది మిగిలినవాటికి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. గత 5-7 ఏళ్లుగా భారత్‌ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాకింగ్ మెరుగుపరుచుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అవి ఫలిస్తుండటంతో ఇప్పుడు అనేక అంతర్జాతీయ కంపెనీలు తరలివస్తున్నాయి. కనుక ఇటువంటి సమయంలో భారత్‌లో రాజకీయ వేదింపులు, కక్ష సాధింపులు తప్పవనే తప్పుడు సంకేతాలు పంపడం శ్రేయస్కరం కాదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీస్ శాఖ కూడా సంయమనం పాటించడం చాలా అవసరం.


Related Post