పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నియామకంలో కూడా జాప్యమేనా?

June 17, 2021


img

తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టుకు 177 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అవసరం ఉందని వెంటనే నియమకాలు చేపట్టాలని హైకోర్టు ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్ర ఏజీని కోరింది. కానీ ఇంతవరకు నియమకాలు చేపట్టకపోవడంతో రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ వ్యవహారంపై బుదవారం విచారణ చేపట్టినప్పుడు, “రెండున్నర నెలలు గడిచినా ఇంతవరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌ను నియమించలేదు. రాష్ట్ర హోంశాఖ నిద్రపోతోందా?న్యాయ వ్యవస్థ కూడా నిద్రపోవాలని భావిస్తోందా?కోర్టు ఆదేశాలను పట్టించుకోని రవిగుప్తాపై కోర్టు ధిక్కారచర్యలు ఎందుకు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలి,” అని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను జూలై 7వ తేదీకి వాయిదా వేసింది. 

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు 50,000 ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తామని పదేపదే చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు. హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప టిఎస్‌పీఎస్సీకి ఛైర్మన్‌, సభ్యులను నియమించలేదు. వారు టిఎస్‌పీఎస్సీ బాధ్యతలు చేపట్టి మూడు వారాలవుతున్నా ఇంతవరకు ఉద్యోగాల నోటిఫికేషన్‌ గురించి మాట్లాడటం లేదు. చివరికి హైకోర్టుకు అత్యవసరమైన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌ను నియమించేందుకు ప్రభుత్వం మీనమేషాలు ఎందుకు లెక్కిస్తోందో తెలీదు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్షాలు, నిరుద్యోగులు, చివరికి హైకోర్టు నుంచి కూడా ఇన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం చలించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 


Related Post