ఈటల ఆత్మగౌరవం అస్త్రం పని చేస్తుందా?

June 16, 2021


img

బిజెపిలో చేరిన తరువాత ఈటల రాజేందర్‌ తొలిసారిగా బుదవారం మేడ్చల్ బిజెపి జిల్లా అధ్యక్షుడు హరిచంద్ర రెడ్డితో కలిసి శామీర్‌పేటలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. “బిజెపిలో చేరినందుకు చాలా గర్వంగా భావిస్తున్నాను. 2024లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుంది.. రాష్ట్రంలో కాషాయజెండాయే ఎగురుతుంది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రజల ఆత్మగౌరవ పోరాటం కనుక నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరూ తామే ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు భావించి ఈ పోరాటంలో పాల్గొనబోతున్నారు. నియోజకవర్గంలో ప్రజల మద్య తిరిగిన వ్యక్తిని నేను. నా కోసం వారు... వారి కోసం నేను అన్నట్లు బ్రతుకుతున్నాము. నిప్పులా బతుకుతున్న నాపై సిఎం కేసీఆర్‌ లేనిపోని అభాండాలు మోపి నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఈ నియంతృత్వ పాలనకు, అహంకారానికి ఘోరీ కట్టాలి. టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు నిద్రపోను,” అని ఆయన మాటల సారాంశం. 

టిఆర్ఎస్‌లో అత్యంత సీనియర్ నేతగా ఉన్న ఈటల రాజేందర్‌ను అత్యంత అవమానకరంగా మంత్రి పదవి నుంచి తొలగించడంతో ఆయన ఆత్మగౌరవం దెబ్బ తినడం సహజమే. ఆయన స్థానంలో ఎవరున్నా ఇదేవిదంగా స్పందిస్తారు. అయితే వాస్తవాలను కూడా పరిగణనలోకి తీసుకొని చూస్తే ఈటల అనుకొంటున్న లేదా కోరుకొంటున్నదానికి పూర్తి భిన్నంగా జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ఈటలకు హుజూరాబాద్‌లో మంచి పట్టు, ప్రజాధారణ కలిగి ఉన్న మాట వాస్తవమే. కానీ తన ఆత్మగౌరవ సమస్యను ప్రజల సమస్యగా భావిస్తారనుకోవడం, అలా భావించి ప్రజలు తనకే ఓట్లు వేసి గెలిపిస్తారనుకోవడం అత్యశే అవుతుంది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో ‘కె.జానారెడ్డిని గెలిపిస్తే ప్రతిపక్షంలో ఉన్న ఆయన నియోజకవర్గానికి ఏమి చేయగలరు?” అంటూ టిఆర్ఎస్‌ వాదనలతో ఆయనను ఓడగొట్టింది. కనుక హుజూరాబాద్‌లో కూడా అదే వాదన చేయడం ఖాయం.  

పైగా ఇప్పుడు ఎన్నికలు సిద్దాంతాలు, విధానాలు, నైతిక విలువలపై ఆధారపడి జరుగడం లేదు. అచ్చం యుద్ధాలలో లాగే వ్యూహ రచన చేయడం, ప్రజలలో ఏదో ఓ సెంటిమెంట్ రగిలించడం, సామధానభేద దండోపాయాల ప్రయోగం వంటివి ఎన్నికలలో సర్వసాధారణమైపోయాయి. టిఆర్ఎస్‌ అధిష్టానానికి మాత్రమే ఇటువంటి గొప్ప శక్తియుక్తులు, సామర్ధ్యం ఉందని అందరికీ తెలుసు. 

ఈవిషయం ఈటల రాజేందర్‌కు కూడా బాగా తెలుసు. బహుశః అందుకే ‘ఆత్మగౌరవం సెంటిమెంటు అస్త్రాన్ని’ ప్రయోగిస్తున్నట్లు భావించవచ్చు. కానీ కరోనా కారణంగా ఇప్పటికిప్పుడు ఉపఎన్నికలు జరిగే సూచనలు కూడా కనిపించడం లేదు. కనుక అప్పటివరకు ఈటల రాజేందర్‌ ఈవేడిని కొనసాగించడం చాలా కష్టమే. ఒకవేళ త్వరలోనే ఉపఎన్నికలు జరిగినా అధికార టిఆర్ఎస్‌ శక్తియుక్తుల ముందు ఈ ఆత్మగౌరవం అస్త్రం పనిచేస్తుందా?అంటే అనుమానమే. కనుక ఈటల ఉపఎన్నికలలోగా కొత్త అస్త్రశస్త్రాలు సమకూర్చుకోవలసి ఉంటుంది. 


Related Post