తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడేదెవరు?

June 16, 2021


img

కాంగ్రెస్‌ అధిష్టానం నేడో రేపో తెలంగాణ పిసిసి అధ్యక్షుడి పేరును ప్రకటిస్తుందని వార్తలు వెలువడుతున్న ఈ సమయంలో పిసిసి జాబితాలో ఉన్న సీనియర్ కాంగ్రెస్‌ నేత దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంగళవారం హటాత్తుగా తాను ఈ రేసులో లేనని పిసిసి అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని ప్రకటించారు. కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తుండటం చేతనే శ్రీధర్ బాబు రేసులో నుంచి తప్పుకొంటున్నారేమో తెలీదు. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఎవరు పిసిసి పగ్గాలు చేపట్టినా చేయగలిగేదేమీ లేదనే చెప్పవచ్చు. 

ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుండటమే కాక మూడో స్థానానికి దిగజారిపోయింది. కరోనా కారణంగా కాంగ్రెస్‌ నేతలు ఎవరూ బయటకు రాలేకపోతుండటం కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. అయినా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన కె.జానారెడ్డి, ఆయనకు మద్దతుగా పలువురు కాంగ్రెస్‌ నేతలు ధైర్యం చేసి విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఓటమి తప్పలేదు. కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, నిరసిస్తూ గాంధీభవన్‌లో ఎన్ని దీక్షలు, ధర్నాలు చేస్తున్నప్పటికీ ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పోరాట పటిమ కోల్పోయిందంటూ ఇటీవలే కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బలంగా లేకపోవడం వలననే మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీని కాదని తన భావజాలానికి ఏమాత్రం పొసగని బిజెపీలో చేరడం అందరికీ తెలుసు.  

ఒకవేళ రేవంత్‌ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ బలోపేతం అవడం మాట అటుంచి నిలువునా చీలిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. పార్టీలో చాలామంది సీనియర్ నేతలు రేవంత్‌ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే తాము సహకరించబోమని ముందే హెచ్చరిస్తున్నారు. ఒకవేళ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేదా మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించినా ఈ పరిస్థితులలో ఎవరూ కూడా చేయగలిగిందేమీ ఉండకపోవచ్చు. బహుశః శ్రీధర్ బాబు అందుకే అధ్యక్ష పదవి వద్దంటున్నారేమో?


Related Post