టీఎస్‌ఆర్టీసీ... ఉద్యోగుల కష్టాలకు అంతే లేదా?

June 16, 2021


img

టీఎస్‌ఆర్టీసీ... ఉద్యోగుల కష్టాల గురించి ఎంత చెప్పుకొన్నా తరిగేవి కావు. మొదటి నుంచి నష్టాల ఊబిలో కూరుకుపోయిన టీఎస్‌ఆర్టీసీపై సమ్మె దెబ్బ, తరువాత కరోనా, లాక్‌డౌన్‌, మళ్ళీ లాక్‌డౌన్‌, నానాటికీ పెరుగుతున్న డీజిల్, వాహన విడిభాగాల ధరలు... ఇలా చెప్పుకొంటూ పోతే అంతే ఉండదు. టీఎస్‌ఆర్టీసీకి వరుసగా ఇన్ని ఎదురుదెబ్బలు తగులుతుండటంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉంది. టీఎస్‌ఆర్టీసీని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేస్తోంది. దీంతో ఇంతవరకు ఉద్యోగులకు ఈనెల జీతాలు చెల్లించలేదు.

ఈ సమస్య ఇప్పుడే మొదలవలేదు. గత ఆరు నెలలుగా జీతాలు ఆలస్యంగానే అందుతున్నాయి. ప్రతీ నెల5వ తేదీ తరువాతే జీతాలు వస్తున్నాయని ఈ నెల ఇంతవరకు చెల్లించకపోవడంతో నానా కష్టాలు పడుతున్నామని డ్రైవర్లు, కండక్టర్లు చెపుతున్నారు. తమ సంస్థ పరిస్థితి గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసి, తమ జీతాల సమస్యలను చూసి ఎవరూ అప్పు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసినా సకాలంలో జీతాలు చెల్లించడం లేదని డ్రైవర్లు, కండెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, సర్పంచులు, ఆశా వర్కర్లకు, హోంగార్డులకు, చివరికి డైలీ వేజ్ వర్కర్లకు కూడా ప్రభుత్వం 30 శాతం జీతాలు పెంచింది. తమకు జీతాలు పెంచకపోయినా ఇచ్చే జీతం సకాలంలో ఇవ్వాలని టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు మొరపెట్టుకొంటున్నారు.తక్షణమే జీతాలు చెల్లించాలని కోరుతూ టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులందరూ నేటి నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు.

టీఎస్‌ఆర్టీసీ సంస్థ... ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు తెలియవనుకోలేము. మరి టీఎస్‌ఆర్టీసీ సంస్థ సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా...ఉద్యోగుల జీతాల చెల్లింపుకి ఆయన ఏమైనా చర్యలు తీసుకొన్నారో లేదో తెలియదు. కనుక టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల మొర సిఎం కేసీఆర్‌ ఎప్పుడు ఆలకిస్తారో... ఏమి చేస్తారో... చూడాలి.   



Related Post