ఇలా భూములు అమ్ముకొంటూపోతే... వి.హనుమంతరావు

June 15, 2021


img

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోవడంతో దానిని భర్తీ చేసుకొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా 20,000 ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మాలని నిర్ణయించి అందుకు చురుకుగా సన్నాహాలు చేస్తోంది. దీనిపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ, “ఇలా వరుసగా భూములు అమ్ముకొంటూ పోతే చివరికి శ్మశానాలకు కూడా స్థలాలు మిగలవు. గత ప్రభుత్వాలు కూడా ఇదేవిదంగా ప్రభుత్వ భూములు అమ్ముకొని ఉంటే నేడు ఇన్ని భూములు మిగిలి ఉండేవా?” అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌ నేతల విమర్శలపై మంత్రి హరీష్‌రావు ఘాటుగా స్పందించారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004-2014 వరకు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తెలంగాణలోని 88,500 ఎకరాల ప్రభుత్వ భూములను అమ్ముకొని ఆ డబ్బుతో ఏపీ, రాయలసీమలో ఖర్చు చేస్తుంటే ఒక్క కాంగ్రెస్‌ నేత కూడా నోరు విప్పలేదు. ఆనాడు డెప్యూటీ స్పీకరుగా ఉన్న భట్టి విక్రమార్క కూడా ప్రభుత్వాన్ని వారించలేదు. కనీసం అభ్యంతరం చెప్పలేదు. ఆనాడు నోరు విప్పని మీరు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? రాష్ట్రంలో నిరుపయోగంగా పడి ఉన్న భూములు అమ్మి తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయాలనుకొంటే కాంగ్రెస్‌ నేతలు సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారికి రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమం పట్టదు. అందుకే ప్రతీ విషయంపై రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తుంటారు. అయినా ప్రతీ రాష్ట్రంలో ప్రభుత్వాలు నిరుపయోగమైన భూములను అమ్ముతూనే ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిదికాదు. ఇప్పుడు అమ్మబోయే భూముల వేలంలో కాంగ్రెస్‌, బిజెపి నేతలతో సహా ఎవరైనా పాల్గొనవచ్చు. దీనిని చాలా పారదర్శకంగా నిర్వహించి ఆ వచ్చే సొమ్ములో ప్రతీ పైసాను తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంపైనే ఖర్చు పెడతాము,” అని మంత్రి హరీష్‌రావు అన్నారు.


Related Post