రైతుబంధు పధకంలో ఈటలకు రూ.26 లక్షలు!

June 15, 2021


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలుచేస్తున్న రైతుబంధు పధకంలో చిన్న, సన్నకారు రైతులతో పాటు వందల ఎకరాలున్న భూస్వాములకు, రాజకీయనాయకులకు కూడా ఏటా అదే లెక్కన భారీగా సొమ్ము అందుతోంది. 

“ఇది సరికాదని రైతుబంధు పధకం కేవలం పేద, సామాన్య రైతులకు మాత్రమే వర్తింపజేయాలని తాను కోరానని, కానీ తాను ఆ పధకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు టిఆర్ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేశారని” మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. దీనిపై మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ, “ఈ పధకం ద్వారా ఈటల రాజేందర్‌ ఇంతవరకు రూ.26 లక్షల వరకు అందుకొన్నారు. మరి ఆ పధకం గురించి ఇప్పుడు తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నారు?” అని ప్రశ్నించారు. 

రైతుబంధు పధకంపై మొదలైన ఈ వాదోపవాదాలు మంచి పరిణామమే అని చెప్పాలి. నిరుపేద, సన్నకారు రైతులు ప్రతీ సీజనులో అప్పులు చేసి వ్యవసాయం మొదలుపెడుతుంటారు. వారికి ఆ కష్టం ఉండొద్దనే సదుద్దేశ్యంతోనే సిఎం కేసీఆర్‌ ఈ పధకాన్ని ప్రవేశపెట్టారు. కనుక వారికి మాత్రమే ఈ పధకాన్ని పరిమితం చేసి ఉండాలి. వీలైతే కౌలు రైతులకు కూడా దీనిని వర్తింపజేయాలి. కానీ కౌలు రైతులకు దీనిని వర్తింపజేయడానికి ససేమిరా అంటున్న సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో వందల ఎకరాలున్న బడా భూస్వాములు, రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు కూడా దీనిని ఎందుకు వర్తింపజేస్తున్నారనేదే ప్రశ్న. 

అవసరం లేకపోయినా ప్రభుత్వం అప్పనంగా ఏటా లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తానంటే ఎవరు మాత్రం కాదంటారు?బహుశః అందుకే ఈటల రాజేందర్‌ కూడా తీసుకొని ఉండవచ్చు. అయితే ఈ విధానమే తప్పు అని ఆయన భావిస్తున్నప్పుడు ఆయన రైతు బంధు సొమ్మును తీసుకోకుండా ఉండాల్సింది. కానీ ఓ పక్క డబ్బు తీసుకొంటూ మళ్ళీ విధానం సరిలేదని చెప్పడం ఆయన ద్వందవైఖరికి అద్దం పడుతోంది. 

ప్రజలు చెమటోడ్చి సంపాదిస్తున్న సొమ్ముతో చెల్లిస్తున్న పన్నులతో సమకూరుతున్న ప్రజాధనాన్ని అప్పనంగా భూస్వాములకు, రాజకీయనాయకులకు పంచిపెట్టడం సరికాదు. కనుక ఈ పధకం అసలు ఏ ఉద్దేశ్యంతో అమలుచేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించుకొని ఇప్పటికైనా దీనిని సామాన్య రైతులకు మాత్రమే దీనిని వర్తింపజేస్తే బాగుంటుంది.


Related Post