బిజెపి మునిగిపోయే నావా? యుద్ధనౌకా?

June 15, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బిజెపిలో చేరడంతో టిఆర్ఎస్‌ నేతలు ఆయనపై ఎదురుదాడి ప్రారంభించారు. కానీ అత్యుత్సాహంతో బిజెపిపై, కేంద్రప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. బిజెపిని ఒక మునిగిపోయే నావ అని ప్రధాని నరేంద్రమోడీ హిట్లర్ అని టిఆర్ఎస్‌ ఎంపీ బడుగుల లింగయ్య తదితర టిఆర్ఎస్‌ నేతలు అభివర్ణించారు. ఈటల రాజేందర్‌ హిట్లర్ వారసుల పార్టీలో చేరారని ఆరోపించారు. టిఆర్ఎస్‌లో ఈటల రాజేందర్‌కు ఎప్పుడు సముచిత ప్రాధాన్యం లభిస్తూనే ఉందని, కూర్చొని మాట్లాడుకొని ఉంటే సమస్యలు పరిష్కారమయ్యేవని కానీ ఆయనకు ఏదో ప్రత్యేక ఎజెండా ఉన్నందునే పార్టీ వీడి బిజెపిలో చేరారని ఆరోపించారు. 

ఈటల రాజేందర్‌ ఎందుకు పార్టీ వీడవలసి వచ్చిందో అందరికీ తెలుసు. కూర్చొని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మంత్రివర్గం నుంచి తొలగించినందునే ఆయన పార్టీని వీడి తన దారి తాను చూసుకోవలసి వచ్చింది తప్ప తనంతట తానుగా పార్టీని వీడలేదని అందరికీ తెలుసు. పార్టీని వీడారు కనుకనే వేరే పార్టీలో చేరాల్సివచ్చింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినా టిఆర్ఎస్‌ నేతలు విమర్శించకుండా ఉండరు. ఈటల బిజెపిలో చేరారు కనుక బిజెపిని విమర్శిస్తున్నారనుకోవచ్చు. 

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌ పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచితంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టిఆర్ఎస్‌ నేతలు, ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్రమోడీని హిట్లర్ అని విమర్శించడాన్ని ఏవిదంగా సమర్ధించుకొంటుంది ఆ పార్టీ? ముఖ్యమంత్రిని ప్రతిపక్షాలు గౌరవించాలని టిఆర్ఎస్‌ కోరుకొంటున్నప్పుడు వారు కూడా ప్రధాని నరేంద్రమోడీని గౌరవించడం మంచిది కదా? 

కాంగ్రెస్ పార్టీని మునిగిపోయే నావ అని అంటే అర్ధం ఉంటుందేమో కానీ ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలలో వ్యాపించి పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రంలో కూడా 70కు పైగా సీట్లు గెలుచుకొన్న బిజెపిని మునిగిపోతున్న నావ అనడం చాలా విడ్డూరంగా ఉంది. నిజానికి ఏదో ఒకరోజున తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న బిజెపి మునిగిపోతున్న నావ కాదు టిఆర్ఎస్‌ను ముంచేయడానికి వస్తున్న యుద్ధనౌక వంటిదని చెప్పుకోవచ్చు. కనుక ఎప్పటికైనా టిఆర్ఎస్‌ పార్టీయే జాగ్రత్తపడాల్సి ఉంటుంది.


Related Post