ఈటల బీజేపీలో చేరడం తప్పా?

June 14, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఇవాళ్ళ బిజెపిలో చేరడంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ, “మంత్రిగా ఉన్నంత కాలం కేంద్రప్రభుత్వాన్ని, బిజెపిని విమర్శించిన ఈటల రాజేందర్‌ ఇప్పుడు అదే పార్టీలో చేరారు. కేంద్రప్రభుత్వ వైఖరితో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు చాలా నష్టం కలుగుతుంటే, ఈటల వెళ్ళి బిజెపిలో చేరడం ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది. టిఆర్ఎస్‌ పార్టీలో, ప్రభుత్వం ఈటల రాజేందర్‌కు చాలా ప్రాధాన్యత, పదవులు కల్పిస్తే ఇంకా తనకు ఏదో తక్కువైనట్లు ఆరోపణలు చేస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన వల్ల బిజెపికి కొత్తగా ఒరిగేదేమీ ఉండదు అలాగే బిజెపి వలన ఆయనకు ఒరిగేదేమీ ఉండదు. భూకబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుచుకొన్న బిజెపి ఏవిదంగా సమర్ధించుకొంటుంది? తెలంగాణ ప్రజలకు ఏమని చెప్పుకొంటుంది?” అని ప్రశ్నించారు.  

మంత్రి జగదీష్ రెడ్డి వాదన నిజమే కానీ ఈటల రాజేందర్‌ తనంతట తాను పార్టీ వీడలేదు భూకబ్జాల ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తొలగించి ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసినందుకే పార్టీని వీడారు. ఈటల వంటి రాజకీయ నాయకుడు మతతత్వ బిజెపిలో చేరడం సబబా కాదా?ఈటల చేరికతో రాష్ట్రంలో బిజెపి బలపడుతుందా లేదా అనే విషయాలను పక్కన పెడితే, ఆయన తన రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకోవడం కోసం తన ముందున్న దారులలో మంచిదనుకొన్న దారిని ఎంచుకొని ముందుకు సాగాలనుకొంటున్నారు అంతే! ఇటువంటి పరిస్థితులలో చిక్కుకొన్న ఏ రాజకీయ నాయకుడైన ఇదే పని చేస్తాడు కనుక ఆయనను తప్పు పట్టడానికి లేదు. నేటికీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న టీఆర్ఎస్ ఆ పార్టీ నుంచే నేతలను తెచ్చుకొంటున్నప్పుడు, ఈటలను బీజేపీలో చేర్చుకోవడం తప్పు ఎలా అవుతుంది?


Related Post